
గుడిపల్లి,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఆగస్టు 29:
జాతీయక్రీడాదినోత్సవాన్ని పురస్కరించు కుని కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలంలోని ద్రావిడ విశ్వవిద్యాలయం లో ఈ నెల 25న ప్రారంభమైన ద్రవిడియన్ త్రోబాల్ ఉమెన్ లీగ్–2026 పోటీలు శనివారం ముగిశాయి. ఐదు రోజులపాటు ఉత్సాహభరితంగా సాగిన ఈ పోటీల్లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొన్నాయి. పోటీల్లో ప్రతిభ కనబరిచిన మూడు జట్లు విజేతలుగా నిలిచాయి. పోటీల్లో పీజీ ఆర్ట్స్ విద్యార్థినుల జట్టు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. జట్టు కెప్టెన్ ఎస్. సుప్రియ మెడల్స్ అందుకున్నారు. ఎంబీఏ విద్యార్థినుల జట్టు ద్వితీయ స్థానంలో నిలవగా, ఆ జట్టు కెప్టెన్ జ్యోత్స్న మెడల్ స్వీకరించారు. బీఈడీ విద్యార్థినుల జట్టు తృతీయ స్థానాన్ని సాధించగా,జట్టు కెప్టెన్ జాహ్నవి మెడల్ అందుకున్నారు. ఈ సందర్భంగా ద్రావిడ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య లక్కినేని చిన్నమల్లయ్య మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు మరిన్ని క్రీడా పోటీలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రతి ఏడాది ద్రవిడియన్ త్రోబాల్ ఉమెన్ లీగ్ పోటీలను నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ కులసచివులు ఆచార్య వి. కిరణ్‌కుమార్, డీన్ ఆచార్య యశోద, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగాధిపతి ఆచార్య విజయవర్ధని, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్పెక్టర్ టి. నవీన్‌కుమార్‌తో పాటు బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.


Recent Comments