
శాంతిపురం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూన్ 21:
చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం గేసికపల్లి రెవెన్యూ గ్రామానికి చెందిన దళిత మహిళ మునిలక్ష్మమ్మపై జరిగిన దాడిని దళిత సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని శనివారం పరామర్శించి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధితురాలు మునిలక్ష్మమ్మ మాట్లాడుతూ, సర్వే నంబర్ 57/1ఇ లో ఉన్న సుమారు 2 ఎకరాల 9 సెంట్ల భూమిని తమ కుటుంబం గత 50 సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తోందని తెలిపారు. అయితే శ్యామరాజుపురానికి చెందిన శ్యామరాజు, అతని కుమారులు ఆ భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తూ తనను కులం పేరుతో దూషించి దాడి చేశారని ఆరోపించారు. దళిత మహిళపై దాడి చేయడం, కులం పేరుతో అవమానించడం అత్యంత ఖండనీయమని దళిత నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కులపై దాడితో సమానమని అభిప్రాయం వ్యక్తం చేశారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు నిందితులపై చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వ భూమిని దశాబ్దాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పేద దళిత కుటుంబాన్ని బెదిరించడం, దౌర్జన్యాలకు పాల్పడటం సహించబోమని, బాధిత కుటుంబానికి ప్రాణహాని ఉన్నందున వెంటనే పోలీసు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని, భూ వివాదంపై రెవెన్యూ అధికారులు ప్రత్యేక విచారణ చేపట్టి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాధిత మహిళకు పూర్తి న్యాయం జరిగే వరకు దళిత సంఘాలు అండగా నిలుస్తాయని స్పష్టం చేశారు. దళితులపై దాడులు ఆపాలి.. బాధితులకు న్యాయం చేయాలి.. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ చిత్తూరు జిల్లా మాజీ అధ్యక్షుడు ఎంపీ ప్రకాష్, బహుజన సేన రాష్ట్ర కార్యదర్శి గోవిందప్ప, జిల్లా నాయకుడు వేలు, కుప్పం నియోజకవర్గ అధ్యక్షుడు మహేష్, ఆటో యూనియన్ నాయకుడు సుబ్బన్న, దళిత సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


Recent Comments