EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

కైలాసనాథుని ధ్వజారోహణం కార్యక్రమం

📰 Generate e-Paper Clip

శ్రీకాళహస్తి, చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 12:

శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు రమ్మంటూ సకల దేవతా గణాలకు స్వాగతం పలుకుతూ బుధవారం సాయంత్రం కైలాసనాథుని ధ్వజారోహణం కార్యక్రమం వైభవంగా సాగింది. ముక్కంటి భక్తులు సమర్పించిన చీరలతో స్వామివారి ధ్వజస్తంభం వద్ద ధ్వజం ఎగుర వేశారు. ధ్వజారోహణం పూర్తయిన తరువాత స్వర్ణముఖి నదీ జలాలతో త్రిశూలాన్ని శుద్ధి చేశారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలకు భక్తకన్నప్ప ధ్వజారోహణంతో అంకురార్పణ జరిగిన సంగతి తెలిసిందే. రెండవ రోజున శ్రీకాళహస్తీశ్వరునికి ధ్వజారోహణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామి వారి గర్భాలయానికి ముందు భాగాన ఉన్న ధ్వజస్తంభం వద్ద గంగాభవానీ సమేత పరమశివుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారి ఉత్సవమూర్తులను ఉంచారు. ఈ ఉత్సవ మూర్తులను దివ్యాభరణాలతో అలంకరించారు. ఆలయ పురోహితులు, అధికారులు శాస్త్రోక్తంగా ధ్వజారోహణానికి పూజా ద్రవ్యాలను అందజేశారు. ఇక ధ్వజారోహణానికి అవసరమైన పూజా సామాగ్రిని, సారెను ఉభయదారులు అందజేశారు. అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామి, అమ్మవార్లకు వివిధ రకాల పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ధ్వజారోహణం తిలకించడానికి విశేష సంఖ్యలో భక్తులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు కొట్టే సాయిప్రసాద్, ఆలయ కార్యనిర్వహణాధికారి టి.బాపిరెడ్డి, మండలి సభ్యులు, ఎమ్మెల్యే బొజ్జల వెంకటసుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి, బొజ్జల బృందమ్మ, ఆలయ డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!