EPAPER
Thursday, August 20, 2026
Google search engine

అభివృద్ధి చెందిన కుప్పాన్ని ప్రజలు త్వరలో చూస్తారు ప్రతి నియోజకవర్గాన్ని ఇదే తరహాలో తీర్చిదిద్దుతాం మీడియా చిట్‌చాట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు

📰 Generate e-Paper Clip

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూలై 05:

 

రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని, కుప్పం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. కుప్పం పర్యటన మూడో రోజు తన నివాసంలో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో రాష్ట్ర అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి, పెట్టుబడులు, సంక్షేమం, రాజకీయ అంశాలపై ఆయన మాట్లాడారు. కుప్పం నియోజకవర్గానికి గతంలో ఎన్నడూ రానన్ని పారిశ్రామిక ప్రాజెక్టులు వస్తున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. రహదారులు, కమ్యూనికేషన్‌తో పాటు అన్ని రంగాల్లో కనెక్టివిటీని పెంచుతున్నామని, త్వరలో అభివృద్ధి చెందిన కుప్పాన్ని ప్రజలు చూస్తారని అన్నారు. కుప్పంలో అమలు చేస్తున్న అభివృద్ధి నమూనాను రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణ విధానంతో అన్ని ప్రాంతాలు సమానంగా ప్రగతి సాధించేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందన్నారు. రాష్ట్రానికి అత్యాధునిక సాంకేతిక రంగాల పెట్టుబడులను తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి సారించామని, క్వాంటం టెక్నాలజీ, సెమీకండక్టర్ రంగాల్లో భారీ పెట్టుబడులు రానున్నాయని వెల్లడించారు. అమరావతిలో ఏర్పాటు చేస్తున్న క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ఈ ఏడాది డిసెంబరు నాటికి కార్యకలాపాలు ప్రారంభిస్తుందని తెలిపారు. ఇంధన రంగంలో కూడా రాష్ట్రాన్ని ముందంజలో నిలిపేందుకు సౌర, పవన విద్యుత్ ఉత్పత్తితో పాటు ఆధునిక విద్యుత్ సరఫరా విధానాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రముఖ ఉక్కు పరిశ్రమలు తమ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్నాయని, పరిశ్రమల అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న భూసమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపుతోందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో కంపెనీలకు భూములు కేటాయించిన తీరు వివాదాలకు దారితీసిందని, ఒకరి ప్రయోజనం కోసం విలువైన భూములు, ఖనిజ సంపద వినియోగం నిలిచిపోయే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఓబుళాపురం, ఆన్‌రాక్ వంటి ప్రాజెక్టులు కూడా ఇలాంటి సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొన్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని సమన్వయం చేస్తూ ముందుకు సాగుతుంటే కొందరు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన సమయంలో గత పాలకులు వాటిని రాష్ట్రం నుంచి వెళ్లిపోయే పరిస్థితి తీసుకొచ్చారని ఆరోపించారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రతి ప్రాజెక్టును తామే తీసుకొచ్చినట్లు కొందరు ప్రచారం చేస్తున్నారని, వాస్తవాలు లేకపోయినా అసత్య ప్రచారాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏజెన్సీ ప్రాంతాలు గంజాయి సాగుకు కేంద్రాలుగా మారాయని, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా “డ్రగ్ ఫ్రీ ఇండియా” కార్యక్రమాన్ని చేపట్టిందని గుర్తు చేశారు. తిరుమల ప్రసాదం కల్తీ ఘటనతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, అలాంటి ఘటనలకు కారణమైనవారే ఇప్పుడు నీతులు చెబుతున్నారని విమర్శించారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు కొందరు ఉద్దేశపూర్వకంగా సామాజిక మాధ్యమాలకు నిధులు సమకూరుస్తున్నారని, తనతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై కూడా అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. హింస, దౌర్జన్యాలు, ఫ్యాక్షన్ రాజకీయాలనే కొందరు ప్రోత్సహిస్తున్నారని అన్నారు. రాయలసీమకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, హంద్రీ-నీవా కాలువ ద్వారా ఇప్పటికే కుప్పం వరకు నీటిని తీసుకొచ్చామని తెలిపారు. త్వరలో గాలేరు-నగరి ప్రాజెక్టును కూడా పూర్తి చేసి మరిన్ని ప్రాంతాలకు సాగునీరు అందిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!