
విజయవాడ,చిత్తూరు ఎక్స్‌ప్రెస్, జూలై 29:
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో జరుగుతున్న వివిధ సమస్యలపై తక్షణ చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ శ్రీ జవహర్‌ను కుప్పం ఎమ్మార్పీఎస్ నాయకులు కోరారు. బుధవారం విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి కుప్పం నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించిన సమగ్ర వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గంలో భూ ఆక్రమణలు, దాడులు, బాధితులకు న్యాయం ఆలస్యం కావడం, అధికారుల నిర్లక్ష్యం, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. బాధితుల ఫిర్యాదులను ప్రత్యేకంగా పరిశీలించి త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు ప్రతి పౌరుడికి క్షేత్రస్థాయిలో అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని, అన్యాయానికి గురైన ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండకూడదని పేర్కొన్నారు. చట్టాలను ఉల్లంఘిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కుప్పం నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నింటిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్సీ కమిషన్‌ను వారు డిమాండ్ చేశారు. బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు ప్రజల తరఫున తమ పోరాటం కొనసాగుతుందని ఎమ్మార్పీఎస్ నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ చిత్తూరు జిల్లా మాజీ అధ్యక్షులు ఎం.పీ. ప్రకాష్, కుప్పం నియోజకవర్గ కో-ఇన్‌చార్జ్ పి. వెంకటేష్, రామకుప్పం మండల సీనియర్ నాయకులు గోవిందప్ప, మహాజన సోషలిస్ట్ పార్టీ మండల అధ్యక్షులు జయప్ప, శంకర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.


Recent Comments