కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి 28:
కుప్పం బిసిఎన్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో కుప్పం ఇంజినీరింగ్ కళాశాల 25 వసంతాల సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు మరియు “నాగాస్త్రా–2026” వార్షికోత్సవ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుని విద్యార్థుల సందడితో కళకళలాడింది. సంస్థ ఫౌండర్ మరియు చైర్మన్ డా. బి.సి. నాగరాజ్, వైస్ చైర్మన్ డా. ఎన్. సునీల్ రాజ్, సెక్రటరీ ఎన్. సాగర రాజ్, ప్రిన్సిపాల్ డా. ఎస్. సుధాకర్ బాబు ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీసీఎన్ విద్యా సంస్థల కుటుంబ సభ్యులు, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ మహోత్సవానికి ప్రత్యేక అతిథిగా ప్రముఖ తెలుగు సినీ నటి మీనాక్షి చౌదరి హాజరై కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు కేవలం మార్కులకే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో తమ ప్రతిభను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. చేసే పనిని ప్రేమతో చేస్తే విజయం సులభంగా సాధ్యమవుతుందని పేర్కొన్నారు. వేడుకల సందర్భంగా అకాడమిక్ రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. అలాగే గత 25 సంవత్సరాలుగా కళాశాలకు సేవలందిస్తున్న 11 మంది సిబ్బంది సభ్యులను ఘనంగా సత్కరించి వారి సేవలను కొనియాడారు. టెక్నికల్, నాన్-టెక్నికల్ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు నిర్వహించిన నృత్యాలు, సంగీత ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. 2001లో స్వల్ప సంఖ్యలో విద్యార్థులతో ప్రారంభమైన ఈ విద్యాసంస్థ నేడు వేలాది మందికి నాణ్యమైన సాంకేతిక విద్యను అందిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిందని డా. బి.సి. నాగరాజ్ తెలిపారు. ఈ విజయానికి విద్యార్థులు, తల్లిదండ్రులు, సిబ్బంది సహకారమే ప్రధాన కారణమన్నారు. భవిష్యత్తులో కూడా విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి కొనసాగిస్తామని వైస్ చైర్మన్ డా. సునీల్ రాజ్ వెల్లడించారు. 25 సంవత్సరాల విజయ ప్రయాణాన్ని స్మరించుకుంటూ నిర్వహించిన ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలు కళాశాల చరిత్రలో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచాయి.


Recent Comments