శ్రీకాళహస్తి, సెప్టెంబర్ 15, చిత్తూరు ఎక్స్ప్రెస్ :శ్రీకాళహస్తి పట్టణంలో సుమారు 50 సంవత్సరాలుగా నివసిస్తున్న షికార్లు(నక్కలవాళ్లు)ఇళ్ల స్థలాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి వెంటనే ఇళ్ల స్థలాలు,పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయంలో ఉప తహసీల్దార్ రవిచంద్రకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు బాలగురవం బాబు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు గడిచినా సుమారు 50 సంవత్సరాలుగా శ్రీకాళహస్తిలో జీవిస్తున్న షికార్లకు సొంతంగా ఇళ్ల స్థలాలు లేకపోవడం అత్యంత శోచనీయమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని కోరారు.శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ పొట్టకూటి కోసం రోడ్లపైనే జీవనం కొనసాగిస్తున్న షికార్ల సమస్యలను అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. వారి సమస్య పై అధికారులు వెంటనే స్పందించి, అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు కేటాయించి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కరీముల్లా, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు హరికృష్ణ, సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త కిరణ్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వినోద్, ఓబీసీ జిల్లా నాయకులు రజాక్, శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు సురేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
