chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 22 June 2026, 8:45 am Digital Edition : CHITTOORE EXPRESS

10కిలోల అండాశయ కణితి తొలగింపులో వైద్యుల విజయం

 

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూన్ 22:

 

కుప్పంలోని బీఆర్‌డీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించి 10 కిలోల బరువున్న అండాశయ కణితిని తొలగించారు. తమిళనాడు రాష్ట్రంలోని నాట్రంపల్లికి చెందిన 48 ఏళ్ల కలై సెల్వి కొంతకాలంగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ చికిత్స కోసం బీఆర్‌డీ ఆసుపత్రిని ఆశ్రయించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమె అండాశయంలో భారీ కణితి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అనంతరం ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ బి.ఆర్.సురేష్ బాబు పర్యవేక్షణలో డాక్టర్ హరిత మండవ, లాపరోస్కోపిక్ శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ హరీష్, డాక్టర్ సిద్ధేశ్వర్ బృందం ప్రత్యేక శస్త్రచికిత్స నిర్వహించి 10 కిలోల బరువున్న కణితిని విజయవంతంగా తొలగించారు. శస్త్రచికిత్సలో ఓటీ సాంకేతిక సిబ్బంది ధనశేఖర్,చంద్రశేఖర్, దివాకర్,కార్తీక్, మనోహర్ సహకారం అందించారు. వైద్యుల నైపుణ్యం,సకాలంలో అందించిన చికిత్సతో శస్త్రచికిత్స విజయవంతమైందని, ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా వైద్య బృందాన్ని రోగి కుటుంబ సభ్యులు అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించడం ఆసుపత్రి వైద్య సేవల సామర్థ్యానికి నిదర్శనమని పలువురు అభిప్రాయపడ్డారు.