
న్యూఢిల్లీ/చిత్తూరు,చిత్తూరు ఎక్స్‌ప్రెస్,జూలై 29:
దేశంలో పర్యావరణహిత గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత రవాణా వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోందని కేంద్ర నూతన, పునరుత్పాదక శక్తి శాఖ మంత్రి శ్రీపాద్ యెస్సో నాయక్ వెల్లడించారు. లోక్‌సభలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ (NGHM) కింద దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 12 పైలట్ ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా మొత్తం 70 హైడ్రోజన్ ఇంధన వాహనాలను రోడ్లపైకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. వీటిలో 27 బస్సులు, 43 ట్రక్కులు ఉండగా, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (FCEVs), హైడ్రోజన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (H2-ICE) వాహనాలు కూడా ఉన్నాయని వివరించారు. అలాగే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 21 ప్రధాన రవాణా మార్గాలపై 16 హైడ్రోజన్ ఇంధన నింపే కేంద్రాలు (Hydrogen Refuelling Stations) ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించినట్లు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు తెలిపారు. రూ.410.77 కోట్ల కేటాయింపు ,ఈ పైలట్ ప్రాజెక్టుల అమలుకు కేంద్ర ప్రభుత్వం సుమారు ₹410.77 కోట్ల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసిందని మంత్రి తెలిపారు. ఇందులో ఇప్పటివరకు ₹41.58 కోట్లను సంబంధిత అమలు సంస్థలకు విడుదల చేసినట్లు వెల్లడించారు. ఈ నిధులను హైడ్రోజన్ వాహనాల కొనుగోలు, ఇంధన నింపే కేంద్రాల ఏర్పాటు, అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధికి వినియోగిస్తున్నట్లు వివరించారు. పర్యవేక్షణకు ప్రత్యేక వ్యవస్థ ,గ్రీన్ హైడ్రోజన్ వాహనాల పనితీరు, భద్రత, ఇంధన వినియోగం, మౌలిక వసతుల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పర్యవేక్షణ, ఫీడ్‌బ్యాక్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు మంత్రి సమాధానంలో పేర్కొన్నారు. పైలట్ ప్రాజెక్టులను అమలు చేస్తున్న సంస్థలు వాహనాల పనితీరు, ఇంధన వినియోగం, భద్రతా ప్రమాణాలు, వినియోగ విధానాలపై క్రమం తప్పకుండా నివేదికలు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ పైలట్ ప్రాజెక్టుల ద్వారా లభించే అనుభవాలు దేశంలో గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత రవాణా వ్యవస్థ విస్తరణకు, సాంకేతిక, ఆర్థిక సాధ్యతను అంచనా వేయడానికి దోహదపడతాయని కేంద్ర మంత్రి పేర్కొన్నట్లు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు వెల్లడించారు.