
పీలేరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మే09:
బ్రతుకుతెరువు కోసం మస్కట్ దేశానికి వెళ్లిన పీలేరు ప్రాంతానికి చెందిన షానాజ్ అక్కడ అనారోగ్యానికి గురై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఘటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి చొరవతో ఆమె సురక్షితంగా స్వగ్రామానికి చేరుకుంది. దీంతో షానాజ్ కుటుంబ సభ్యులు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. విదేశంలో అనారోగ్యంతో బాధపడుతూ తీవ్ర ఆందోళనలో ఉన్న షానాజ్ తనను రక్షించాలని వీడియో ద్వారా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను వేడుకుంది. దీనిపై వెంటనే స్పందించిన ఉప ముఖ్యమంత్రి సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు చేపట్టేలా ఆదేశించారు. అలాగే ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆమె స్వదేశానికి చేరేందుకు సహకరించారు. ఈ సందర్భంగా షానాజ్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ విదేశంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో తమకు దేవుళ్లలా అండగా నిలిచారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నారై సేవా విభాగం అధ్యక్షుడు వేమూరు రవికుమార్, కార్యాచరణ సేవల విభాగం నిర్వాహకుడు నాగేంద్రబాబు అక్కిలి, ఎన్నారై లంకెపల్లి మధు చొరవతోనే షానాజ్ క్షేమంగా ఇంటికి చేరుకుందని పేర్కొన్నారు. ప్రజల సమస్యలపై వెంటనే స్పందించి మానవత్వంతో ముందుకు వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామని కుటుంబ సభ్యులు భావోద్వేగంతో తెలిపారు.