గ్రామ అభివృద్ధి అధికారిణి శాంతి

తొట్టంబేడు, చిత్తూరు ఎక్స్ప్రెస్ దసరా పండుగను పురస్కరించుకుని ఏపీప్రభుత్వం చేపట్టిన ఇంటింటి పరిశుభ్రత అవగాహన మాసోత్సవాల్లో భాగంగా తొట్టంబేడు మండలం లోని చిట్టత్తూరు గ్రామ పంచాయతీలో గ్రామ అభివృద్ధి అధికారిణి శాంతి ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛ రథం ద్వారా గ్రామస్తుల ఇళ్ల నుంచి పొడి చెత్త, డ్రై వేస్ట్ను సేకరించారు.ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి అధికారిణి శాంతి మాట్లాడుతూ గ్రామాల్లో పరిశుభ్రతను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ‘దసరా ధమాకా’ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా స్వచ్ఛ రథానికి 3 కిలోలకు పైబడి పొడి చెత్తను అందించే ప్రతి కుటుంబానికి ఒక లక్కీ టోకెన్ అందజేస్తామని తెలిపారు.అక్టోబర్ 26న దసరా పండుగ రోజున లక్కీ డిప్ నిర్వహించి, ఎంపికైన ముగ్గురు విజేతలకు నిత్యజీవితంలో ఉపయోగపడే ఆకర్షణీయమైన బహుమతులు అందజేస్తామని వెల్లడించారు. గ్రామస్తులు పునర్వినియోగానికి పనికొచ్చే రీసైక్లింగ్ వస్తువులను వేరు చేసి స్వచ్ఛ రథం ఆపరేటర్కు అందించడం ద్వారా చెత్త నుంచి ఆదాయం పొందవచ్చన్నారు.చెత్తను రోడ్లపై పడేయకుండా బాధ్యతగా వ్యవహరించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ చిట్టత్తూరు గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని శాంతి పిలుపునిచ్చారు.