
పెనుమూరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూన్16:
రోడ్డుప్రమాదంలో మృతిచెందిన స్నేహితు డి కుటుంబానికి అతని సహపాఠులు ఆర్థిక సాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. పెనుమూరు మండలం గాంధీపురానికి చెందిన అనిల్‌కుమార్ ఇటీవల జరిగిన రోడ్డుప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అనిల్‌తో కలిసి 2004-05 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన సహపాఠులు కుటుంబా నికి అండగా నిలవాలని నిర్ణయించారు. ఇందుకోసం పరస్పరం విరాళాలు సేకరించి రూ.55 వేల నిధిని సమకూర్చి సోమవారం రాత్రి కుటుంబ సభ్యులకు అందజేశారు. అనిల్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారని,వారి విద్యాభ్యాసం, భవిష్యత్తు అవసరాల కోసం తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ కుటుంబానికి అండగా ఉంటామని సహపాఠులు తెలిపారు. కష్టకాలంలో స్నేహితుడి కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకు రావడం సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. సహపాఠులు చూపిన ఈ మానవతా దృక్పథాన్ని గ్రామస్థులు అభినందించా రు. స్నేహం అనేది కేవలం చదువుకునే రోజులకే పరిమితం కాదని, అవసర సమయంలో కుటుంబానికి అండగా నిలవడం ద్వారా సహపాఠులు నిజమైన స్నేహానికి నిదర్శనంగా నిలిచారని కొనియాడారు.