chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 03 June 2026, 8:41 am Digital Edition : CHITTOORE EXPRESS

సోయాబీన్ సాగుతో రైతులకు అదనపు ఆదాయం

వి.కోట,చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూన్ 2

 

చిత్తూరు జిల్లా వి.కోట మండలంలో వేరుశనగ పంటకు ప్రత్యామ్నాయంగా సోయాబీన్స్  సాగువ్యవసాయ అధికారి రైతులకు సూచించారు. మార్కెట్ అవకాశాలు, తక్కువ సాగు వ్యయం, కొనుగోలు హామీ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని రైతులు సోయాబీన్ సాగుపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. కుప్పం నియోజకవర్గంలోని గుడిపల్లిలో ఏర్పాటు చేసిన సోయాబీన్ నూనె పరిశ్రమ ఆధ్వర్యంలో బైబ్యాక్ విధానంలో సోయాబీన్ సాగుకు రైతులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఈ విధానంలో పండించిన పంటను కంపెనీ నేరుగా కొనుగోలు చేయనున్నందున రైతులకు మార్కెటింగ్ సమస్యలు ఉండవని పేర్కొన్నారు. సోయాబీన్ సాగు చేపట్టే రైతులకు ఎకరాకు అవసరమైన 25 కిలోల విత్తనాలను కంపెనీ ఉచితంగా అందజేస్తుందని తెలిపారు. ఈ పంట సాగు కాలం సుమారు 90 రోజులు ఉంటుందని, వర్షాధార ప్రాంతాల్లోనూ, నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లోనూ సాగు చేయవచ్చని చెప్పారు. నెలకు రెండు తడులు అందిస్తే పంట సక్రమంగా ఎదుగుతుందని, ఎకరాకు 6 నుంచి 8 క్వింటాళ్ల వరకు దిగుబడి పొందే అవకాశం ఉందని వివరించారు. పంట కోత కోసం అవసరమైన యంత్రాలను కూడా కంపెనీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సోయాబీన్ సాగుపై ఆసక్తి ఉన్న రైతులు తమ గ్రామ పరిధిలోని రైతు సేవా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. జూన్ నెలాఖరులోపు విత్తనాలు విత్తితే మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. సోయాబీన్ సాగు ద్వారా రైతులు పంటల వైవిధ్యీకరణతో పాటు అదనపు ఆదాయం పొందే అవకాశముందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ పిలుపునిచ్చింది.