chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 06 June 2026, 9:15 pm Digital Edition : CHITTOORE EXPRESS

సురక్షిత చిత్తూరు” కార్యక్రమానికి ఘన శ్రీకారం

 

 

చిత్తూరు,చిత్తూరు ఎక్స్‌ప్రెస్,జూన్ 06:

 

 

చిత్తూరుజిల్లా ప్రజలభద్రత, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల నివారణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన “సురక్షిత చిత్తూరు –మీ భద్రత మా బాధ్యత ” కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాన్ని శనివారం చిత్తూరు పట్టణంలోని సంతపేట ఆర్.ఆర్.గార్డెన్స్‌లో జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమా నికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్,చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, నాన్ కేడర్ ఎస్పీ ఎస్.ఆర్. రాజశేఖర రాజు,చుడా చైర్‌పర్సన్ కటారి హేమలత,పోలీసు అధికారులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు,మహిళలు, యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రారంభ కార్యక్రమంలో భాగంగా సబ్ డివిజన్ డీఎస్పీ జె. వెంకటనారాయణ “సురక్షిత చిత్తూరు” లోగోను, కార్యక్రమ లక్ష్యాలను ప్రజలకు వివరించారు. అనంతరం మహిళలు, చిన్నారులపై నేరాల నివారణ, మాదకద్రవ్యాల వ్యసనం, సైబర్ నేరాలు, రోడ్డు భద్రత అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ తుషార్ డూడి మాట్లాడుతూ.. ప్రజల భద్రత కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడు కూడా భాగస్వామి కావాల్సిన అవసరం ఉందన్నారు. నేరాలు జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే ముందస్తు అవగాహన ద్వారా నేరాలను నివారించడం మరింత ప్రభావవంతమైన విధానమని తెలిపారు. మహిళ లు, చిన్నారులపై నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం, సైబర్ మోసాలు, రోడ్డు ప్రమాదాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే కార్యక్రమ ప్రధాన ఉద్దేశమన్నారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ.. సామాజిక, సాంకేతిక సవాళ్లను ఎదుర్కొ నేందుకు అవగాహన ఎంతో అవసరమని చెప్పారు. మహిళల రక్షణ,చిన్నారుల భద్రత,సైబర్ భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలన,రోడ్డు భద్రత వంటి అంశాలపై ప్రజలను చైతన్యపరిచే ఈ కార్యక్రమం జిల్లాకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం కోసం జిల్లా పోలీసు శాఖ చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమం అభినందనీ యమని తెలిపారు. యువతను సరైన దిశలో నడిపించడం తో పాటు నేరాల నివారణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే సామర్థ్యం ఈ కార్యక్రమానికి ఉందన్నారు. కార్యక్రమంలో భాగంగా నాయుడుపేటకు చెందిన నటరాజ కళాక్షేత్ర బృందం మహిళలపై నేరాలు, ప్రేమ పేరుతో జరిగే మోసాలు, ఎలోప్మెంట్ ఘటనలు, మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై సందేశాత్మక నాటికలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించి ప్రేక్షకులను ఆకట్టు కుంది. సమాజానికి ఉపయోగపడే సందేశాలను అందించిన కళాకారులను ఎస్పీ,కలెక్టర్, ఎమ్మెల్యే తదితరులు సన్మానించి అభినందించారు. జిల్లా వ్యాప్తంగా మహిళల రక్షణ,చిన్నారుల భద్రత, మాదకద్రవ్యాల నియంత్రణ, సైబర్ అవగాహన, రోడ్డు భద్రత అంశాలపై విస్తృతస్థాయిలో అవగాహన కార్యక్రమాలు కొనసాగను న్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ ఎం.దేవదాస్, డీఎస్పీలు,సీఐలు,ఎస్ఐలు,వివిధ శాఖల అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు,విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.