chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 03 April 2026, 7:50 am Digital Edition : CHITTOORE EXPRESS

సర్పంచ్ వార్డు సభ్యులకు ఘనసన్మానం పారిశుద్ధ్య కార్మికులకు కాళ్లు కడిగి సన్మానించిన సర్పంచ్ తనయుడు 

వి.కోట,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఏప్రిల్ 02:

 

పలమనేరునియోజకవర్గం వి.కోటమండలం,మేజర్ గ్రామపంచాయతీ వి.కోట సర్పంచ్,వార్డు సభ్యుల పదవీకాలం ముగియడంతో సర్పంచ్ పిఎన్ లక్ష్మి వార్డు సభ్యులకు, అధికారులకు ఘనంగాసన్మానం చేశారు. స్థానిక పంచాయతీ కార్యాలయ ఆవరణ నందు ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాల పాటు అభివృద్ధిలో సహకరించిన అధికారులకు, ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. తమ హయాంలో వైయస్సార్ కమర్షియల్ కాంప్లెక్స్ లు నిర్మాణం చేపట్టామని, పంచాయతీ పరిధిలో సిసి రోడ్లు,హై మాస్క్ లైట్లు, హిందూ స్మశాన వాటిక అభివృద్ధి, త్రాగునీరు, అందించడం జరిగిందన్నారు. స్వచ్ఛభారత్ లో భాగంగా తాము చేపట్టిన పారిశుధ్య పనులకు గాను స్టేట్ లెవెల్ లో అవార్డు రావడం కార్మికుల యొక్క గొప్పతనం అన్నారు. పారిశుద్ధ్య కార్మికుల కోసం పెరిగిన జీవన వ్యయాన్ని ఆధారంగా చేసుకొని నెలకు 15 వేల రూపాయలు జీతం చెల్లించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. వి.కోట పట్టణం నందు వీధులను గుర్తించే నిమిత్తం పేర్లు పెట్టడం జరిగిందని అదేవిధంగా లాంగ్ బజార్ కు మహాత్మా గాంధీ రోడ్డుగా నామకరణం చేయడం జరిగింది అన్నారు. పంచాయతీ పరిధిలో తడి చెత్త, పొడి చెత్తను వేరు వేరుగా సేకరించి చెత్త నుండి సంపద తయారీ కేంద్రం కు తరలించేందుకుగాను గ్రీన్ అంబాసిడర్ లను ఏర్పాటు చేసి ప్రజలు అనారోగ్యం బారినపడకుండా చర్యలు తీసుకున్నామన్నారు. వి.కోట రెవెన్యూ గాండ్లపల్లి గ్రామ సమీపంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేశామన్నారు. కరోనా సమయంలో దహన సంస్కారాలు, నిరుపేదలకు భోజనం వసతి కరోనా కిట్లు కల్పించామన్నారు. వి.కోట పట్టణ ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలోనే ఎనిమిదవ మెజార్టీ సర్పంచగా తను గెలిపించడం, తనపై బాధ్యతను పెంచిందని, మీరు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి చేసి చూపించానన్నారు. పంచాయితీ కార్మికులు వీకోట పట్టణాన్ని శుభ్రంగా ఉంచడంలో వారి పాత్ర అభినందనీయమని, వారి వలన తన కుటుంబానికి, సర్పంచ్ కు ప్రజల్లో మంచి పేరు తీసుకొచ్చారని, సర్పంచ్ తనయుడు, రాష్ట్ర వైయస్సార్సీపి ప్రధాన కార్యదర్శి పిఎన్ నాగరాజ్ అన్నారు. ఈ సందర్భంగా కార్మికులను వరుసగా కూర్చోబెట్టి దృశ్యాలవ లు కప్పి పూలమాలలు వేసి వారి కాళ్ళను కడిగి పాదాభివందనం చేశారు. తమ ఐదు సంవత్సరాల పరిపాలనలో సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఈ ఓ నరేష్, మా జీవో యాదవపతి, మైందల రామచంద్రుడు, ముదిమడుగు ఆంజనేయులు, వివిధ శాఖల అధికారులు, పట్టణ పుర ప్రజలు పాల్గొన్నారు.