చిత్తూరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 14:
భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతిని చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా టిడిపి అధ్యక్షుడు చెక్కుడు కుప్పం షణ్ముగం రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్వీట్లు పంచుతూ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా షణ్ముగం రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి కేవలం రాజ్యాంగం మాత్రమే కాకుండా సమానత్వానికి పునాది ఇచ్చిన మహానేత అని అన్నారు. అణగారిన వర్గాలకు గౌరవంగా జీవించే హక్కులు ఆయన కృషి ఫలితమని పేర్కొన్నారు. సమాజంలో చివరి వ్యక్తికి న్యాయం జరిగే వరకు టిడిపి పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. చిత్తూరు పార్లమెంట్ సభ్యుడు దగ్గుమల్లు ప్రసాద్ రావు మాట్లాడుతూ అంబేద్కర్ చూపిన మార్గం దేశానికి దిశానిర్దేశం చేసిందన్నారు. ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించడం ద్వారానే నిజమైన అభివృద్ధి సాధ్యమని తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ దొరబాబు మాట్లాడుతూ అంబేద్కర్ జీవితాంతం అన్యాయం, అసమానతలపై పోరాడిన నాయకుడని, ఆయన ఆలోచనలను ప్రతి నాయకుడు ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే ఏ.ఎస్. మనోహర్ మాట్లాడుతూ అంబేద్కర్ జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని, విద్యతో మరియు పట్టుదలతో ఉన్నత శిఖరాలను చేరవచ్చని ఆయన నిరూపించారని అన్నారు. చూడా చైర్మన్ కటారి హేమలత మాట్లాడుతూ మహిళలు, బీసీలు, అణగారిన వర్గాలకు అంబేద్కర్ కల్పించిన హక్కులు అమూల్యమని, సమానత్వం సాధనలో ఆయన పాత్ర విశేషమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రతినిధులు, వివిధ విభాగాల నాయకులు, దళిత నాయకులు, మహిళలు, టిడిపి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.