
వి.కోట,చిత్తూరు ఎక్స్ప్రెస్,సెప్టెంబర్ 28:
తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వి.కోట మండలంలోని గ్రామపంచాయతీ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏలు) సోమవారం మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట సమ్మె చేపట్టారు. మండలంలోని అన్ని గ్రామపంచాయతీలకు చెందిన వీఆర్ఏలు సమ్మెలో పాల్గొని తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా వీఆర్ఏలు మాట్లాడుతూ తమ సమస్యలను ప్రభుత్వం పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని కోరారు. వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని, వారి విద్యార్హతలను బట్టి వీఆర్వోలు, అటెండర్లు, నైట్ వాచ్మెన్ తదితర పోస్టుల్లో పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే నామినీ ప్రాతిపదికన పనిచేస్తున్న వీఆర్ఏలను క్రమబద్ధీకరించి పర్మినెంట్ చేయాలని, వీఆర్వో పదోన్నతుల్లో ప్రస్తుతం ఉన్న 30 శాతం కోటాను 70 శాతానికి పెంచాలని కోరారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను సానుకూలంగా పరిశీలించి పరిష్కరించి తమను ఆదుకోవాలని వీఆర్ఏలు విజ్ఞప్తి చేశారు.