
కడప, చిత్తూరు ఎక్స్‌ప్రెస్, జూలై 28:
సన్‌రైజ్ ప్రీ-స్కూల్ నిర్వాహకురాలిని కత్తితో బెదిరించి అక్రమంగా నగదు వసూలు చేసిన ఘటనలో ఐదుగురు నిందితులను కడప తాలూకా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి నేరానికి ఉపయోగించిన కత్తితో పాటు రూ.3,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కడప తాలూకా పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నంబర్ 102/2026 కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో బుక్కే జగన్ మోహన్ నాయక్ అలియాస్ జగన్ నాయక్ (29), నాగిపోగు ఓబయ్య (34), చౌడవరం విజయ సాయి అలియాస్ విజయ్ కుమార్ (53),దారా కమ్మన్న అలియాస్ కంబన్న (43), సుంకు శ్యామ్ ప్రసాద్ అలియాస్ శ్యామ్ (55) ఉన్నారు.పోలీసుల వివరాల ప్రకారం.. సన్‌రైజ్ ప్రీ-స్కూల్‌కు అనుమతులు లేవనే అంశాన్ని ఆసరాగా చేసుకున్న నిందితులు పాఠశాల నిర్వాహకురాలిని బెదిరించి డబ్బులు వసూలు చేయాలని పథకం రచించారు. కొందరు విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల పేర్లు ఉపయోగించగా, మరికొందరు విలేకరులు, యూట్యూబ్ ఛానల్ ప్రతినిధులుగా కెమెరాలతో పాఠశాలలోకి ప్రవేశించారు. అనంతరం పాఠశాలలో వీడియోలు, ఫొటోలు తీసి.. స్కూల్ మూయిస్తామని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో బాధితురాలి నుంచి నగదు వసూలు చేసినట్లు గుర్తించారు. అరెస్టు చేసిన నిందితుల నుంచి నేరానికి ఉపయోగించిన ఆరు అంగుళాల పొడవైన కత్తి, రూ.500 నోట్ల రూపంలో మొత్తం రూ.3,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.