
కుప్పం,చిత్తూరు ఎక్స్‌ప్రెస్,మే 23:
కుప్పం మండలంలోని షాహీ గార్మెంట్స్ సంస్థలో శనివారం కుప్పం డీఎస్పీ పార్థసారథి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుప్పం రూరల్ సీఐ మల్లేష్ యాదవ్, పోలీసు సిబ్బంది పాల్గొని మహిళా ఉద్యోగినులకు పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు. ప్రస్తుత సమాజంలో మహిళల భద్రత, పిల్లల రక్షణ, సైబర్ నేరాల నివారణపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ పార్థసారథి సూచించారు. రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు. ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీకి సంబంధించిన చట్టాలు, మహిళలకు అందుబాటులో ఉన్న రక్షణ సేవలపై వివరించారు. సైబర్ క్రైమ్‌ల పేరుతో జరుగుతున్న ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని లింకులు ఓపెన్ చేయకూడదని, ఓటీపీలు ఇతరులకు చెప్పరాదని సూచించారు. ధైర్యస్పర్శ కార్యక్రమం ద్వారా మహిళలు, చిన్నారులకు అందిస్తున్న సహాయ సేవలను వివరించారు. డ్రగ్స్ వినియోగం వల్ల యువత భవిష్యత్తు నాశనం అవుతోందని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే ఐపీఎల్ బెట్టింగ్ వంటి అక్రమ కార్యకలాపాల్లో పాల్గొంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోక్సో చట్టంపై మహిళలు, చిన్నారులకు అవగాహన కల్పిస్తూ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి వివరించారు. చిన్నారులపై ఎలాంటి వేధింపులు జరిగినా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా ఉద్యోగినులు పెద్ద సంఖ్యలో పాల్గొని పోలీసు అధికారులను ప్రశ్నలు అడిగి సందేహాలను నివృత్తి చేసుకున్నారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, షాహీ గార్మెంట్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.