
కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మే 14:
చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ నెల 18వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహించనున్న గంగమ్మ జాతర ఏర్పాట్లను జిల్లా ఎస్పీ తుషార్ డూడి పరిశీలించారు. ఆలయ అధికారులు, కుప్పం డీఎస్పీ పార్థసారధితో కలిసి గంగమ్మ దేవాలయం, అగ్నిగుండం, బలిపీటం, ట్రాఫిక్ మళ్లింపు ప్రాంతాలను సందర్శించి ఏర్పాట్లపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గంగమ్మ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారని, ఈసారి కూడా భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అదనపు పోలీసు బలగాలతో పాటు ప్రత్యేక భద్రత చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. జాతర సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ మళ్లింపు చర్యలు అమలు చేస్తామని తెలిపారు. పిక్‌పాకెటింగ్, ఆకతాయిల వేధింపులు, అవాంఛనీయ ఘటనల నివారణకు ప్రత్యేక క్రైమ్ బృందాలను ఏర్పాటు చేసి నిరంతరం నిఘా ఉంచుతామని వెల్లడించారు. భక్తులకు మంచినీరు, వైద్య సహాయం, శౌచాలయాలు వంటి మౌలిక వసతులు కల్పించేందుకు స్థానిక అధికారులతో సమన్వయం చేస్తున్నామని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సహాయం అందించేందుకు ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడవద్దని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ తరుణ్ పహ్వా, కుప్పం రూరల్ ఇన్స్పెక్టర్ మల్లేష్ యాదవ్, ప్రత్యేక శాఖ ఇన్స్పెక్టర్ మురళీమోహన్, ఆలయ చైర్మన్ రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.