
కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మే 17:
చిత్తూరు జిల్లా కుప్పం శ్రీప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా నిర్వహిస్తున్న నాలుగు రోజుల సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మూడో రోజు స్థానిక కళాకారుల ప్రతిభ పోటీలు ఘనంగా నిర్వహించగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్నారులు, యువతులు, యువకులు ప్రదర్శించిన నృత్యాలు, సాంస్కృతిక విన్యాసాలు సభికులను అలరించాయి. కార్యక్రమ ప్రాంగణం హర్షధ్వానాలతో మారుమోగింది. హోరాహోరీగా సాగిన పోటీలలో ఎన్.కొత్తపల్లికి చెందిన బెట్టప్ప బృందం ప్రథమ బహుమతిని కైవసం చేసుకుంది. కుప్పంకు చెందిన నూపుర నృత్యాలయ ద్వితీయ బహుమతి సాధించింది. మూడవ బహుమతి ఎస్‌పిఆర్ నృత్య సంస్థకు, నాలుగవ బహుమతి నటరాజ నాట్యాలయకు, ఐదవ బహుమతి శాంతిపురానికి చెందిన శ్రీ దివ్య నాట్యశాలకు దక్కాయి. విజేతలకు నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రవి చంద్రబాబు, కమిటీ సభ్యులు, సాంస్కృతిక విభాగ సభ్యులు పాల్గొని విజేతలను అభినందించారు. గ్రామీణ ప్రాంతాలలో దాగి ఉన్న కళా ప్రతిభను వెలికితీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. స్థానిక కళాకారులకు ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీలను తిలకించేందుకు పరిసర ప్రాంతాల ప్రజలు భారీగా తరలివచ్చారు. జాతర వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు కుప్పం పట్టణంలో పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి.