124 కిలోల గంజాయి స్వాధీనం.. 47 మంది అరెస్ట్.. 7 మందిపై పీడీ చట్టం అమలు
శ్రీకాళహస్తి, చిత్తూరు ఎక్స్ప్రెస్
శ్రీకాళహస్తి పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో డి.ఎస్.పి నరసింహమూర్తి గురువారం మీడియా సమావేశంలో ఏర్పాటు చేశారు.మీడియా సమావేశంలో డి.ఎస్.పి నరసింహమూర్తి మాట్లాడుతూ సబ్‌డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, మాదకద్రవ్యాల నిర్మూలన, మహిళలు , చిన్నారుల భద్రతకు పోలీసులు విస్తృత స్థాయిలో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు పలుమార్లు ఏరియా డామినేషన్ కార్యక్రమాలు నిర్వహించి నేరస్థులు, అసాంఘిక శక్తుల పై నిఘా ఏర్పాటు చేశారు. మొత్తం 15 కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించి, సరైన పత్రాలు లేని సుమారు 600 వాహనాలను స్వాధీనం చేసుకుని చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. రాత్రివేళల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న 49 మందిని అదుపులోకి తీసుకుని బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయగా, ప్రజా శాంతికి భంగం కలిగించే అవకాశం ఉన్న 55 మందిపై కూడా బైండ్ ఓవర్ చర్యలు చేపట్టారు. గంజాయి వినియోగాన్ని అరికట్టే క్రమంలో 776 మంది యువతకు గంజా టెస్ట్ కిట్లతో పరీక్షలు నిర్వహించగా, 46 మందికి పాజిటివ్ రావడంతో చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. మాదకద్రవ్యాల నియంత్రణలో భాగంగా 16 ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేసి, 47 మంది నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి మొత్తం 124 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు. అలాగే గంజాయి విక్రేతలు, మట్కా నిర్వాహకులు, అక్రమ లాటరీ టికెట్ల విక్రయదారుల పై ప్రత్యేక దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు.నేరాల నియంత్రణలో భాగంగా ఎన్‌డీపీఎస్ కేసుల్లో నలుగురు, ఆస్తి సంబంధిత నేరాల్లో ముగ్గురిపై మొత్తం ఏడుగురికి పీడీ (ప్రివెంటివ్ డిటెన్షన్) చట్టం అమలు చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించారు.
మహిళలు, బాలికల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఈవ్‌టీజింగ్, స్టాకింగ్, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై పాఠశాలలు, కళాశాలలు, బాలికల హాస్టళ్లలో వారానికి రెండుసార్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్-112 సేవలను వినియోగించుకోవాలని విద్యార్థినులకు సూచిస్తున్నారు.ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్, అతివేగం, హెల్మెట్, సీటుబెల్ట్ నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తూ చర్యలు తీసుకుంటున్నారు. కమ్యూనిటీ పోలీసింగ్, బీట్ పోలీసింగ్, సీసీ కెమెరాల వినియోగాన్ని విస్తృతం చేస్తూ ప్రజల సహకారంతో నేరాల నివారణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాత్రివేళల్లో నిరంతర పెట్రోలింగ్, లర్కింగ్ బీట్‌లు నిర్వహిస్తూ, రాత్రి 10 గంటలకు వైన్ షాపులు, హోటళ్లు, రాత్రి 12 గంటలకు బార్ అండ్ రెస్టారెంట్లు నిర్ణీత సమయానికి మూసివేసేలా పర్యవేక్షణ కొనసాగుతోంది.ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి నరసింహమూర్తి ,వన్ టౌన్ సిఐ వెంకటేష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
