chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 18 May 2026, 8:42 pm Digital Edition : CHITTOORE EXPRESS

శ్రీకాళహస్తి టూ టౌన్ పోలీస్ స్టేషన్ నూతన భవన ప్రారంభోత్సవం రూ. 2.75 కోట్లతో అత్యాధునిక వసతులతో పోలీస్ స్టేషన్ నిర్మాణం

శ్రీకాళహస్తి,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మే 18:

 

శ్రీకాళహస్తి పట్టణంలో టూ టౌన్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని రాష్ట్ర హోం శాఖ మంత్రి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, స్థానిక ఎం ఎల్ ఏ బొజ్జల సుధీర్ రెడ్డి కలసి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పి ఎల్. సుబ్బారాయుడు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర హోం మంత్రి మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, ప్రజలకు జవాబుదారీతనం ఉండేలా రూ.2.75 కోట్ల వ్యయంతో శ్రీకాళహస్తి 2 టౌన్ పోలీస్ స్టేషన్‌ను నిర్మించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రజలకు అందించే సేవల పై పోలీస్ శాఖ స్పష్టతతో పని చేస్తుందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ గవర్నెన్స్ లో భాగంగా పేద ప్రజలకు పోలీస్ సేవలు మరింత సులభతరం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజలు ఇచ్చే ఫిర్యాదులను తక్షణమే ఆన్‌లైన్‌లో నమోదు చేసి, వాటిని పరిష్కరించే తీరును ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షించే విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. బైక్ చోరీ జరిగినా, ఇతర కేసులు నమోదైనా వాటి పురోగతిని జిల్లా ఎస్పీతో పాటు హోం శాఖ ఒకే డిజిటల్ డ్యాష్‌బోర్డ్ ద్వారా పరిశీలించే విధంగా సాంకేతికతను వినియోగిస్తున్నామని వెల్లడించారు. సమస్యల పరిష్కారంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. శ్రీకాళహస్తి పోలీస్ స్టేషన్ జిల్లాలోనే ది బెస్ట్ పోలీస్ స్టేషన్‌గా నిలుస్తుందని పేర్కొంటూ ఈ భవన నిర్మాణంలో కృషి చేసిన జిల్లా ఎస్పీకి ప్రత్యేక అభినందనలు తెలిపారు. శ్రీకాళహస్తి ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమని, ప్రతి రోజు వేలాది మంది భక్తులు దర్శనార్థం వస్తున్న నేపథ్యంలో వారి భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించడమే కాకుండా, భద్రతా చర్యలను మరింత బలోపేతం చేస్తున్నట్లు వివరించారు. జిల్లా ఇంచార్జి మంత్రి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ స్టేషన్లు అత్యాధునిక రూపాన్ని సంతరించు కుంటున్నాయని, దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి దూరదృష్టి ప్రధాన కారణమని అన్నారు. పోలీస్ స్టేషన్లు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తూ, పారదర్శక పాలనకు కేంద్రాలుగా మారుతున్నాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే పేద ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు ఈ సరికొత్త వ్యవస్థ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. బాధితుల ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నమోదు చేసి, కేసుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించే విధానం అమలులో ఉందని చెప్పారు. హోం మంత్రి, జిల్లా ఎస్పీ ప్రత్యేక చొరవతో కేసుల పరిష్కారంలో జాప్యం లేకుండా డిజిటల్ డెస్క్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారని తెలిపారు. దీని ద్వారా కేసుల పరిష్కారం మరింత వేగవంతమవుతోందన్నారు. రూ. 2.75 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ అత్యాధునిక పోలీస్ స్టేషన్ జిల్లాలోనే అత్యుత్తమ పోలీస్ స్టేషన్‌గా నిలవడం గర్వకారణమని పేర్కొన్నారు. పట్టణంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు, ఆలయ పరిసరాల్లోని నిఘా వ్యవస్థలను పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా శివరాత్రి వంటి భారీ ఉత్సవాల సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ అప్రమత్తంగా పనిచేస్తోందన్నారు. ప్రజలు పోలీస్ శాఖకు అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖ సమర్థవంతంగా పనిచేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. స్థానిక శాసన సభ్యులు మాట్లాడుతూ శ్రీకాళహస్తి టూ టౌన్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని ప్రారంభించడం సంతోషకర విషయమని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ సహా పోలీస్ శాఖ అధికారులందరికీ అభినందనలు తెలియజేస్తూ వారి కృషి వల్లే ఈ భవనం ప్రజలకు అందుబాటులోకి వచ్చిందన్నారు. 2008లో ఈ పోలీస్ స్టేషన్ ప్రారంభమైందని, అనంతరం 2018లో నూతన భవనానికి శంకుస్థాపన జరిగినప్పటికీ గత కొన్నేళ్లుగా నిర్మాణ పనులు నిలిచిపోయాయని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన అనంతరం పనులను వేగవంతంగా పూర్తి చేసి, ప్రారంభోత్సవం నిర్వహించడం జరిగిందన్నారు. దాదాపు 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ నూతన భవనం నిర్మించబడిందని చెప్పారు. ఎస్.హెచ్.ఓ గది నుండి మహిళల కౌన్సెలింగ్ రూమ్ వరకు ప్రతి విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, ఆధునిక సౌకర్యాలతో కూడిన పోలీస్ స్టేషన్‌గా తీర్చిదిద్దినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టి టి డి బోర్డు మెంబర్ పనబాక లక్ష్మీ, యాదవ కార్పొరేషన్ ఛైర్మన్ నరసింహ యాదవ్, హస్త కళల ఛైర్మన్ పసుపులేటి హరిప్రసాద్, ప్రజాప్రతినిధులు, అడిషనల్ ఎస్పిలు రవి మనోహరచారి, శ్రీనివాస్ రావు, శ్రీకాళహస్తి డి.ఎస్.పి నరసింహమూర్తి,వన్ టౌన్ సిఐ,టూ టౌన్ సిఐ, తొట్టంబేడు సిఐ,ఎస్సైలు,స్థానిక నాయకులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.