chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 16 July 2026, 7:18 am Digital Edition : CHITTOORE EXPRESS

శ్రీకాళహస్తిలో త్వరలో ముద్రగడ పద్మనాభం విగ్రహం ఏర్పాటు చేస్తాం మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి

శ్రీకాళహస్తి , చిత్తూరు ఎక్స్ప్రెస్, జూలై 15
శ్రీకాళహస్తి దివంగత సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం స్మారకార్థం శ్రీకాళహస్తిలో త్వరలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తెలిపారు. శ్రీకాళహస్తి దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఆధ్వర్యంలో పట్టణంలోని వైఎస్సార్ సర్కిల్ వద్ద నిర్వహించిన ముద్రగడ పద్మనాభం నివాళి కార్యక్రమంలో ఆయన పాల్గొని చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం ప్రజాసేవకు, సామాజిక న్యాయానికి అంకితభావంతో పనిచేసిన నాయకుడని కొనియాడారు. పదవుల కంటే ప్రజా సంక్షేమానికే ఆయన ప్రాధాన్యత ఇచ్చారని, వెనుకబడిన వర్గాలు, పేదలకు న్యాయం జరగాలనే లక్ష్యంతో రాజకీయ జీవితమంతా పోరాటం చేశారని పేర్కొన్నారు. నిజాయితీ, నిబద్ధతకు ఆయన ప్రతీకగా నిలిచారని, రాజకీయ జీవితంలో ఎలాంటి అవినీతి మరక లేకుండా ప్రజల ఆదరణ పొందారని అన్నారు.శ్రీకాళహస్తిలో ఇప్పటికే శ్రీకృష్ణదేవరాయల విగ్రహం, రంగా విగ్రహం ఏర్పాటు చేసినట్లు గుర్తుచేసిన ఆయన, మూడో విగ్రహంగా ముద్రగడ పద్మనాభం విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించనున్నట్లు ప్రకటించారు. ఆయన మరణం రాష్ట్ర రాజకీయాలకు, ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు. అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం విలువలకు కట్టుబడి రాజకీయాలు చేసిన నాయకుడని, ఐదు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలకు విశేష సేవలందించారని తెలిపారు. ముఖ్యంగా కాపు సామాజికవర్గం అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. నిజాయితీ, ఆత్మగౌరవం, వ్యక్తిత్వానికి ముద్రగడ పద్మనాభం నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఉన్నం వాసు నాయుడు, చంద్రయ్య నాయుడు, స్వర్ణమూర్తి, అంజూరు వెంకటేష్ బాబు, పత్తిమణి, వల్లం గోపి, చింతామణి పాండు, కంట ఉదయ్, సాధన మున్న రాయల్, బుల్లెట్ జై శ్యామ్,  మునికృష్ణారెడ్డి, జిలాని భాష, పటాన్ ఫరీద్, జీవీకే రెడ్డి, సతీష్, జూమ్లేష, వేలూరు రమేష్, ప్రకాశం పంతులు, శ్రీనివాసులు, ఖాదర్ బాషా, సెల్వ, రాజా, నాగేంద్ర, ఆజాద్, ఈశ్వర్ సాయి, ప్రసాద్, సుధీర్‌తో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ముద్రగడ పద్మనాభంకు ఘనంగా నివాళులర్పించారు.