
ఖాజీపేట,చిత్తూరు ఎక్స్‌ప్రెస్, జూలై 14:
ఖాజీపేట మండలంలోని రైతులకు విద్యుత్ శాఖ తాత్కాలికంగా వ్యవసాయ విద్యుత్ సరఫరాలో మార్పులు చేపట్టనున్నట్లు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (డీఈఈ) శ్రీకాంత్ తెలిపారు. గత పది రోజులుగా మైదుకూరు నియోజకవర్గంతో పాటు ఖాజీపేట మండల పరిధిలో వ్యవసాయ మోటార్ల వినియోగం గణనీయంగా పెరగడంతో 33 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలపై అధిక లోడు పడుతోందని పేర్కొన్నారు. దీంతో 220 కేవీ, 132 కేవీ ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్లు, 33 కేవీ ఫీడర్లలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పాటు ఫీడర్లు తరచూ ట్రిప్ అవుతున్నాయని వివరించారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ వ్యవస్థకు నష్టం జరగకుండా ఉండేందుకు వ్యవసాయ బోర్లకు ఒకేసారి 9 గంటల విద్యుత్ సరఫరా చేయకుండా, ఫీడర్ల వారీగా రెండు గ్రూపులుగా విభజించి విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. లోడు తగ్గిన అనంతరం మళ్లీ యథావిధిగా అన్ని ప్రాంతాలకు ఒకే సమయంలో 9 గంటల విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని చెప్పారు. ఈ తాత్కాలిక మార్పును రైతులు అర్థం చేసుకుని విద్యుత్ శాఖకు సహకరించాలని డీఈఈ శ్రీకాంత్ విజ్ఞప్తి చేశారు. ఉపకేంద్రాల పరిధిలోని ఫీడర్ల వారీగా విద్యుత్ సరఫరా సమయాలను ప్రత్యేక పట్టిక రూపంలో విడుదల చేసినట్లు వెల్లడించారు.