chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 30 August 2026, 8:29 am Digital Edition : CHITTOORE EXPRESS

వైభవంగా మూడో శ్రావణ శనివారం పూజలు గోవింద నామస్మరణతో మార్మోగిన రాళ్లబూదుగూరు కొండ

శాంతిపురం,చిత్తూరు ఎక్స్‌ప్రెస్, ఆగస్టు 29:

శ్రావణ మాసం మూడో శనివారాన్ని పురస్కరించుకుని చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలోని పలు దేవాలయాల్లో శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రాళ్లబూదుగూరు గ్రామంలోని కొండపై వెలసిన కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాకారోత్సవం, కోనేటి ఉత్సవం నిర్వహించడంతో పాటు ఉత్సవమూర్తులను గ్రామ వీధుల్లో మేళతాళాలతో ఊరేగించారు. స్వామివారి దర్శనం కోసం చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. కోనేటి వద్ద భక్తులు తలనీలాలు సమర్పించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. కొండ ప్రాంగణం మొత్తం భక్తుల గోవింద నామస్మరణతో మార్మోగింది. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు. శ్రావణ శనివారం సందర్భంగా ఆలయ పరిసరాల్లో భక్తి వాతావరణం నెలకొంది.