
కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మే10:
కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపేట జయప్రకాశ్ రోడ్డు సమీపంలోని సంపంగి నగర్ ప్రాంతంలో వీధి దీపాలు లేక స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో చీకట్లు కమ్ముకోవడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, విద్యార్థులు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నట్లు స్థానికులు తెలిపారు. ప్రధాన రహదారికి అనుసంధానంగా ఉన్న ఈ ప్రాంతంలో పలుచోట్ల వీధి దీపాలు పనిచేయకపోవడంతో రాత్రి సమయంలో ప్రమాదాల ముప్పు పెరిగిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చీకటి కారణంగా ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడటంతో పాటు అపరిచితుల సంచారం కూడా పెరుగుతోందని స్థానికులు పేర్కొన్నారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో పాములు, విష పురుగుల భయం కూడా నెలకొందని తెలిపారు. సమస్యపై పలుమార్లు సంబంధిత అధికారులకు వినతులు అందించినప్పటికీ ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. తక్షణమే సంపంగి నగర్ ప్రాంతంలో వీధి దీపాలను ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని స్థానికులు కుప్పం మున్సిపాలిటీ అధికారులను కోరుతున్నారు.