
పెనుమూరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్, మే 29:
పెనుమూరు మండల విద్యాశాఖాధికారి-1గా విధులు నిర్వహిస్తున్న రాజేంద్రన్ ఈ నెల 31న పదవీ విరమణ పొందనున్న సందర్భంగా శుక్రవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఘనసన్మాన సభ నిర్వహించారు. విద్యారంగం లో ఆయన అందించిన సేవలను స్మరించుకుంటూ ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పాల్గొన్న అతిథులు మాట్లాడుతూ రాజేంద్రన్ ఉపాధ్యాయుడిగా తన సేవా ప్రస్థానాన్ని ప్రారంభించి, ప్రధానోపాధ్యాయుడిగా పాఠశాలల అభివృద్ధికి కృషి చేసి, అనంతరం మండల విద్యాశాఖాధికారిగా బాధ్యతలు చేపట్టి విద్యా ప్రమాణాల పెంపునకు విశేష కృషి చేశారని కొనియాడారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి, పాఠశాలల మౌలిక వసతుల మెరుగుదల, నాణ్యమైన విద్య అందించడంలో ఆయన చేసిన సేవలు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. తన ఉద్యోగ జీవితమంతా విద్యార్థుల భవిష్యత్తు కోసం అంకితభావంతో పనిచేసిన రాజేంద్రన్, ఉపాధ్యాయులకు మార్గదర్శకుడిగా నిలిచారని వక్తలు తెలిపారు. విద్యాశాఖలో సమర్థవంతమైన పరిపాలన అందిస్తూ విద్యా రంగ పురోగతికి విశేషంగా తోడ్పడ్డారని ప్రశంసించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి రాజేంద్ర ప్రసాద్, మండల విద్యాశాఖాధికారి-2 భాస్కరనా యుడు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు హేమలతా రెడ్డి,తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు రుద్రయ్యనా యుడు,వివిధ మండలాల విద్యాశాఖాధికారులు, ప్రధానో పాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొని రాజేంద్రన్‌కు పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాలతో సన్మానించి పదవీ విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాల తో జీవించాలని ఆకాంక్షించారు. సన్మానానికి స్పందించిన రాజేంద్రన్ తన సేవా కాలంలో సహకరించిన విద్యాశాఖ అధికారులు,ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల అభ్యున్నతే తనకు ఎల్లప్పుడూ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. సభ ఆత్మీయ వాతావరణంలో కొనసాగింది.