
రాజంపేట,చిత్తూరు ఎక్స్‌ప్రెస్ , జూలై 29:
ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లోకి విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, మీడియా ప్రతినిధుల ప్రవేశాన్ని పరిమితం చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను వెంటనే ఉపసంహరించుకోవాలని రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్‌ఎస్‌యూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తొండంనాటి ప్రశాంత్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాజంపేట పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ఆర్‌ఎస్‌యూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తొండంనాటి ప్రశాంత్ మాట్లాడుతూ, కలెక్టర్ లేదా ఉన్నతాధికారుల అనుమతి లేకుండా సంక్షేమ వసతి గృహాల్లోకి విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, మీడియా ప్రతినిధులు ప్రవేశించరాదంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించకుండా వాటిని ప్రజలకు తెలియకుండా దాచిపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలోని అనేక సంక్షేమ వసతి గృహాల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, పోషకాహారం, భద్రత, సిబ్బంది కొరతవంటి సమస్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. విద్యార్థిసంఘాలు,ప్రజాప్రతినిధులు,మీడియా సందర్శించడం వల్లే ఈ సమస్యలు వెలుగులోకి వచ్చి పరిష్కారానికి నోచుకుంటున్నాయని, ఇప్పుడు అలాంటి సందర్శనలను నిషేధించడం ప్రభుత్వ వైఫల్యాలను దాచే ప్రయత్నమేనని అన్నారు. వసతి గృహాలు జైళ్లు కాదని, విద్యార్థుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన వసతి కేంద్రాలని పేర్కొన్న ఆయన, వాటిపై ప్రజా పర్యవేక్షణ ఉండటం సహజమని అన్నారు. విద్యార్థుల హక్కులను హరించే నిర్ణయాలను ఆర్‌ఎస్‌యూ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని హెచ్చరించారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర రాజధాని విజయవాడలో ఆర్‌ఎస్‌యూ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఆందోళనలు చేపడతామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లా కమిటీ సభ్యులు జస్వంత్, చరణ్, భాష, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.