chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 29 May 2026, 12:15 pm Digital Edition : CHITTOORE EXPRESS

లక్ష్మీపురంలో ఆపరేషన్ క్లియర్ స్వీప్ నిర్వహణ మునిసిపల్ కమిషనర్ శ్రీనివాసరావు

 

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మే 29:

 

 

చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీపురం ప్రాంతంలో శుక్రవారం “ఆపరేషన్ క్లియర్ స్వీప్” కార్యక్రమాన్ని మునిసిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విస్తృతంగా నిర్వహించారు. పట్టణ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, దోమల వ్యాప్తిని నివారించడం, ప్రజల్లో పారిశుధ్యంపై అవగాహన కల్పించడం లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బంది వీధుల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి, కాలువల్లోని మురుగును శుభ్రం చేశారు. అలాగే రోడ్ల పక్కన ఉన్న మురికి నీటి నిల్వలను తొలగించి, బ్లీచింగ్ పౌడర్, ఫాగింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి చెత్తను వేర్వేరుగా సేకరించాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా మున్సిపల్ సిబ్బందికి అందించాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, పారిశుధ్య సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు. లక్ష్మీపురం ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు తెలిపారు.