chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 16 June 2026, 7:08 am Digital Edition : CHITTOORE EXPRESS

రైతులకు వేరుశనగ విత్తనాల పంపిణీ ప్రారంభం

పీలేరు,చిత్తూరు ఎక్స్‌ప్రెస్,జూన్ 15:

 

ఖరీఫ్ సీజన్‌లో రైతులకు అవసరమైన విత్తనాలను సకాలం లో అందించి సాగుకు ప్రోత్సాహం కల్పించే లక్ష్యంతో పీలేరు మార్కెట్ యార్డు ఆవరణలో వేరుశనగ విత్తన కాయల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పురం రామమూర్తి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి రైతులకు వేరుశనగ విత్తన కాయల బస్తాలను అందజేశారు. మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందని తెలిపారు. పీలేరు మండల పరిధిలోని గ్రామాలకు ప్రభుత్వం 1,600 క్వింటాళ్ల వేరుశనగ విత్తన కాయలను కేటాయించినట్లు వెల్లడించారు. రైతులు తమ గ్రామాల్లో ముందుగానే నమోదు చేసుకుని అందుబాటులో ఉన్న రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తన కాయలను పొందాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను రైతులు సద్వినియోగం చేసుకుని సాగు పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని కోరారు. నాణ్య మైన విత్తనాలతో సాగు చేపట్టడం ద్వారా దిగుబడులు పెరగడంతో పాటు రైతులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. రైతులకు అవసరమైన వ్యవసాయ సేవలను అందించేందుకు అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు డైరెక్టర్ గోళ్ళ కిషోర్ నాయుడు, నాయకులు దేవిరెడ్డి వెంకటరమణారెడ్డి, బాబు, సహాయ వ్యవసాయ అధికారిణి హిమబిందు, వ్యవసాయ విస్తరణ అధికారులు నజీర్, జహీర్, రైతు భరోసా కేంద్రాల సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.