చిత్తూరు, చిత్తూరు ఎక్స్ ప్రెస్ ,జూలై,10:
జిల్లాలో స్వయం సహాయక సంఘాల సభ్యులకు బ్యాంకు రుణాల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడితే అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటన లో హెచ్చరించారు. జిల్లాలో కొన్ని మండలాల్లో ఇటీవల మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వ పథకాలు, బ్యాంకు లింకేజీలు, స్త్రీ నిధి, సిఐఎఫ్, వడ్డీ లేని రుణాలు, జీవనోపాధి యూనిట్లు మంజూరు చేయిస్తామని అక్రమంగా నగదు వసూలు చేస్తున్నట్లు జిల్లా అధికార యంత్రాంగం దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ , వెలుగు పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల బలోపేతం, మహిళలఆర్థిక స్వాలంబన , జీవనోపాదుల పెంపు, ఉపాధి అవకాశాలు కల్పన, బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాల అమలు, మహిళా సాధికారత లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నట్లు కలెక్టర్ వివరించారు. అయితే జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో రుణాల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఇలాంటి వారిని ఉపేక్షించేది లేదని, అటువంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు . ప్రభుత్వ పథకాల పేరుతో లేదా అధికారిక సేవల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడినా ప్రయత్నించినా స్వయం సహాయక సంఘ సభ్యులు సంబంధిత ఆధారాలతో జిల్లా కలెక్టర్ కు కానీ ,జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ . పథక సంచాలకులకు నేరుగా గాని లేక రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం చిత్తూరు డిఆర్డిఏ లో ప్రత్యేకంగా కాల్ సెంటర్ ను అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. ఫిర్యాదులను9390505066 నెంబర్ కు ఫోన్ చేసి తెలపాలని సూచించారు. స్వయం సహాయ సంఘ సభ్యులు ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ వసూళ్లకు లొంగొద్దని, ఎవరైనా నగదును డిమాండ్ చేస్తే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. సంఘాల్లోని మహిళలకు అర్హతను బట్టి ప్రత్యేక ప్రభుత్వ వ్యవస్థ ద్వారా రుణాలు పారదర్శకంగా మంజూరు చేస్తారన్న విషయాన్ని సంఘ సభ్యులు గుర్తించాలన్నారు. సభ్యులు పారదర్శకత, జవాబుదారితనం, అవినీతి రహిత వ్యవస్థను బలోపేతం చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ తెలిపారు.