
కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఏప్రిల్ 24:
గత సంవత్సరం నవంబర్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్కూల్ ఫెడరేషన్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలలో కుప్పం పట్టణానికి చెందిన విద్యార్థిని ప్రతిభ కనబరిచింది. కుప్పం పట్టణం కొత్తపేట జయప్రకాష్ రోడ్డులో నివాసం ఉండే శ్యామల, కృష్ణంరాజుల కుమార్తె, స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని యోగ విభాగంలో తృతీయ స్థానం సాధించి ప్రతిభ చాటింది. రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ఈ యోగ పోటీలలో వివిధ జిల్లాల నుండి పాల్గొన్న పోటీదారుల మధ్య కఠినమైన పోటీ నెలకొనగా, కుప్పం విద్యార్థిని తన ప్రతిభతో మెప్పించి మూడో స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా విజయం సాధించిన విద్యార్థినిని అభినందిస్తూ మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ)తో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, వెంకటేశ్వర బాబు, ఉపాధ్యాయుల బృందం ప్రత్యేకంగా సత్కరించారు. విద్యార్థినికి ధ్రువపత్రాలను అందజేసి, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిలో రాణించాలని ఆశీర్వదించారు. ఈ విజయంపై పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థినికి అభినందనలు తెలిపారు.