chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 4:13 am Digital Edition : CHITTOORE EXPRESS

రాళ్లబూదుగూరులో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

శాంతిపురం,చిత్తూరు ఎక్స్‌ప్రెస్,ఆగస్టు15:

 

చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం రాళ్లబూదుగూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 2025–26 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను దుశ్శాలువాలతో సత్కరించి, నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. పదో తరగతిలో 600 మార్కులకు 530 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచిన ఎస్. లైలాకు రూ.5,000 నగదు బహుమతిని రెస్కో డైరెక్టర్ ఎస్. బసవరాజు అందజేశారు. 519 మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచిన ఎం. పల్లవికి రూ.3,000ను రాళ్లబూదుగూరు యూనిట్ ఇన్‌చార్జి ఆర్.ఎస్. మణి అందించారు. 518 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచిన ఆర్. పావనికి మండల ఉపాధ్యక్షుడు బి.ఎం. కుమార్ బహుమతి అందజేసి అభినందించారు. తెలుగులో 100కు 100 మార్కులు సాధించిన శరణ్యకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అశోక్ రూ.1,016 నగదు బహుమతి అందించారు. ప్రతి సంవత్సరం పదో తరగతిలో ప్రతి సబ్జెక్టులో 100కు 100 మార్కులు సాధించే విద్యార్థులను నగదు బహుమతులతో ప్రోత్సహించి సత్కరిస్తానని ప్రధానోపాధ్యాయుడు తెలిపారు.నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఉత్తమ ఫలితాలు సాధించి ఉన్నత చదువుల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎస్.ఎ. వాజిద్ దుశ్శాలువాలతో సత్కరించి మెమెంటోలు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ ప్రకాష్, రెస్కో డైరెక్టర్ బసవరాజు, యూనిట్ ఇన్‌చార్జి ఆర్.ఎస్. మణి, మండల ఉపాధ్యక్షుడు బి.ఎం. కుమార్, ఎస్.ఎ. వాజిద్, బి.ఎం. సురేష్, మంజు, శ్రీనివాసులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.