
రేణిగుంట, చిత్తూరు ఎక్స్‌ప్రెస్, జూలై 27:
ఇటీవల నిర్వహించిన యోగా పోటీల్లో రేణిగుంటకు చెందిన స్వామి వివేకానంద ఉచిత యోగా అసోసియేషన్ క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మొత్తం ఆరు పతకాలను కైవసం చేసుకుని సత్తా చాటారు. అసోసియేషన్‌కు చెందిన బాలచందర్, లీలావతి తలా ఒక బంగారు పతకాన్ని గెలుచుకోగా, భగవాన్ దాస్, మహేష్, జగదీష్ తలా ఒక వెండి పతకాన్ని సాధించారు. గుణశేఖర్ కాంస్య పతకాన్ని అందుకొని అసోసియేషన్‌కు మరో విజయాన్ని అందించారు. ఈ విజయాలతో రేణిగుంటకు మంచి గుర్తింపు తీసుకువచ్చిన క్రీడాకారులను స్థానికులు, అసోసియేషన్ సభ్యులు అభినందించారు. ఈ సందర్భంగా విజేతల తల్లిదండ్రులు, అసోసియేషన్ ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేస్తూ క్రీడాకారులను అభినందించారు. విద్యార్థులను క్రమశిక్షణతో తీర్చిదిద్ది, పోటీలకు సమర్థంగా సిద్ధం చేసిన వెంకటేష్ మాస్టర్, సుబ్రహ్మణ్యం సర్‌ల సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. రాబోయే రాష్ట్ర, జాతీయ స్థాయి యోగా పోటీల్లో కూడా ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధించి రేణిగుంటకు మరింత పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆకాంక్షించారు.