
కుప్పం,చిత్తూరు ఎక్స్‌ప్రెస్,జూన్ 21:
యోగ సాధనలో విశేష ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్న కుప్పం పట్టణానికి చెందిన విద్యార్థిని కె.తేజశ్రీకి ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ధ్రువపత్రం అందజేసి అభినందించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చిత్తూరు జిల్లా కేంద్రంలోని పీవీకేఎన్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన “యోగాంధ్ర” పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులకు ధ్రువపత్రాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కుప్పం పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని కె.తేజశ్రీకి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ చేతుల మీదుగా ధ్రువపత్రాన్ని అందజేశారు. జిల్లా తరఫున రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటిన తేజశ్రీని వారు ప్రత్యేకంగా అభినందిస్తూ, భవిష్యత్తులో జాతీయ స్థాయిలోనూ రాణించాలని ఆకాంక్షించారు. కె.తేజశ్రీ కుప్పం పట్టణానికి చెందిన శ్యామల, కృష్ణంరాజు దంపతుల కుమార్తె. చిన్న వయసులోనే యోగాపై ఆసక్తి పెంచుకుని క్రమశిక్షణతో సాధన చేస్తూ రాష్ట్రస్థాయి వరకు చేరుకోవడం అభినందనీయమని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తెలిపారు. యోగ సాధన ద్వారా శారీరక,మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడంతో పాటు విద్యార్థులు క్రమశిక్షణను అలవర్చుకోవచ్చని కార్యక్రమంలో పాల్గొన్న వారు పేర్కొన్నారు. తేజశ్రీ సాధించిన ఈ గుర్తింపు కుప్పం ప్రాంత విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని, ఆమె మరింత ఉన్నత స్థాయికి చేరుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర బాబు, ఉపాధ్యాయులు,విద్యార్థులు, తల్లిదండ్రులు కె.తేజశ్రీని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.