
ములబాగిలు,చిత్తూరు ఎక్స్ ప్రెస్,సెప్టెంబర్ 13:
ములబాగిలు తాలూకా మేళగాణి గ్రామంలో త్రైత సిద్ధాంత ప్రబోధ సేవా సమితి, ఈ రోజు జ్ఞాన వేదిక ములబాగిలు సమితి ఆధ్వర్యంలో శ్రీకృష్ణుడి జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 4న శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి తొమ్మిది రోజులపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పదో రోజైన ఆదివారం శ్రీకృష్ణ స్వామి మూర్తితో గ్రామంలో వైభవంగా ఊరేగింపు నిర్వహించారు. మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన ఊరేగింపులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కోలాటాలు, భజనలు, భగవద్గీత నినాదాలు, జయజయ ధ్వానాలతో గ్రామాన్ని మార్మోగించారు. గ్రామంలోని ప్రతి ఒక్కరిలో ఆత్మశక్తిగా ఉన్న దైవత్వాన్ని శ్రీకృష్ణుడి రూపంలో దర్శించుకోవడం, ప్రజల్లో జ్ఞానోదయం కలిగించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో త్రైత సిద్ధాంత ప్రబోధ సేవా సమితి, ఈ రోజు జ్ఞాన వేదిక మేళగాణి సమితి అధ్యక్షుడు భరత్, సభ్యులు చంద్రు, అశోక్, బాలాజీ, హేమంత్, మనోహర్, వాణిశ్రీ, భాస్కర్, జ్యోతి తదితరులతో పాటు జిల్లా ప్రబోధ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా నుంచి 100 మందికి పైగా సభ్యులు హాజరయ్యారు. గ్రామ పెద్దలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీకృష్ణుడి పల్లకిని మోసి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు.