chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 03 July 2026, 6:23 am Digital Edition : CHITTOORE EXPRESS

ముఖ్యమంత్రి  పర్యటనకు మున్సిపాలిటీ అప్రమత్తం.. అభివృద్ధి పనుల స్థలాల పరిశీలన

 

కుప్పం, చిత్తూరు ఎక్స్ ప్రెస్,జులై 02:

 

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడు రోజులపాటు చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించనున్న నేపథ్యంలో పట్టణ పరిధిలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన స్థలాలను మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముఖ్యమంత్రి ప్రారంభించనున్న, శంకుస్థాపనలు చేయనున్న అభివృద్ధి కార్యక్రమాలు సజావుగా జరిగేలా చేపడుతున్న ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. కార్యక్రమాల వేదికలు, పరిసర ప్రాంతాల పరిశుభ్రత, రహదారుల మరమ్మతులు, తాగునీటి సదుపాయాలు, విద్యుత్ దీపాల ఏర్పాటు, పారిశుధ్య నిర్వహణతో పాటు ఇతర మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా కమిషనర్ సంబంధిత అధికారులకు పలు సూచనలు చేస్తూ, ముఖ్యమంత్రి పర్యటనకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల్లో నాణ్యతను పాటిస్తూ, ప్రజలకు అసౌకర్యం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు మున్సిపల్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. పరిశీలనలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ జిమ్ దాము, మున్సిపల్ అధ్యక్షుడు కాణిపాకం వెంకటేష్, మైనార్టీ అధ్యక్షుడు జాకీర్, పార్టీ ఆర్గనైజింగ్ సభ్యుడు రాజ్‌కుమార్, తెలుగుదేశం పార్టీ నాయకులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సీఎం పర్యటన విజయవంతం కావడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.