
పెనుమూరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మే 22 :
పెనుమూరు మార్కెట్ యార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణమ్మ నాయుడు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు, ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం.థామస్ చొరవతో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తామని పేర్కొన్నారు. శుక్రవారం పెనుమూరు మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డులో చేపట్టాల్సిన మౌలిక సదుపాయాల అభివృద్ధి, రైతులకు మెరుగైన సేవలు అందించే చర్యలు, మార్కెట్ వసతుల విస్తరణ, పరిశుభ్రత నిర్వహణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. రైతులు మార్కెట్‌కు తీసుకువచ్చే వ్యవసాయ ఉత్పత్తులకు అనువైన సదుపాయాలు కల్పించడం, మార్కెట్ యార్డులో తాగునీరు, పారిశుద్ధ్యం, నిల్వ వసతులు, రహదారుల అభివృద్ధి వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తామని చైర్మన్ తెలిపారు. మార్కెట్ యార్డు అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. రైతులకు మరింత ఉపయోగ కరంగా, సౌకర్యవంతంగా మార్కెట్ యార్డును తీర్చిదిద్దడ మే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ అరుల్ నాదన్,పెనుమూరు మండల అధ్యక్షుడు రుద్రయ్య నాయుడు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు లోకమ్మ, దేవరాజులు, కొందండరెడ్డి, నియాజ్ అలీ,అరుణ,రేణుక, దుర్గాప్రసాద్,జ్యోతి,చారుమతి,శ్రీధర్ యాదవ్,సుబ్రహ్మణ్యం నాయుడు,గురవయ్య నాయుడు,శ్రీనివాసులు చౌదరి,బాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు.