
చిత్తూరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూన్ 02:
చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. మామిడి కొను గోలు ప్రక్రియ పారదర్శకంగా సాగడంతో పాటు రైతుల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని పరిశ్రమల యాజమాన్యాలకు స్పష్టం చేశారు. సోమవారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో జిల్లాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా మామిడి కొనుగోలు ధరలు, రైతులకు గిట్టుబాటు ధర కల్పించే చర్యలు, కొనుగోలు విధానం, పరిశ్రమల నిర్వహణ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. జిల్లాలో మామిడి సాగు విస్తీర్ణం అధికంగా ఉండటంతో రైతులు పండించిన పంటకు సరైన ధర లభించేలా పరిశ్రమల యాజమాన్యాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. మార్కెట్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులకు న్యాయమైన ధర చెల్లించాలని, కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, రైతులు తీసుకొచ్చే పంటను నాణ్యత ప్రమాణాల ప్రకారం పరిశీలించి వెంటనే కొనుగోలు చేయాలని సూచించారు. రైతులు అనవసరంగా వేచి ఉండాల్సిన పరిస్థితి రాకుండా తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. మామిడి గుజ్జు పరిశ్రమల నిర్వహణలో ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, పరిశ్రమల కార్యకలాపాల వల్ల రైతులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ పేర్కొన్నారు.రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని, రైతుల సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతామని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, మామిడి గుజ్జు పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.