
చిత్తూరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మే 16:
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, విక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ తుషార్ డూడి వెల్లడించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తూ శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు క్షణిక ఆనందాన్ని ఇచ్చినా జీవితాలను నాశనం చేస్తున్నాయని తెలిపారు. గంజాయి,డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడిన యువత ఆరోగ్యం, కుటుంబ జీవితం,భవిష్యత్తు దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. సరదాగా ప్రారంభమయ్యే అలవాటు చివరకు వ్యసనంగా మారి యువతను చీకటిలోకి నెట్టేస్తోందని హెచ్చరించారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల విద్యార్థుల చదువులు దెబ్బతినడమే కాకుండా జీవిత లక్ష్యాలు కూడా నాశనం అవుతున్నాయని పేర్కొన్నారు. యువత చెడు స్నేహాలకు దూరంగా ఉండి విద్య, క్రీడలు, ఉపాధి లక్ష్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు. యువత చేతిలో పుస్తకం ఉంటే భవిష్యత్తు వెలుగుతుందని, డ్రగ్స్ ఉంటే జీవితం అంధకారంలోకి వెళ్తుందని తెలిపారు. గంజాయి,ఇతర నార్కోటిక్ పదార్థాల అక్రమ రవాణా, నిల్వ, విక్రయాల్లో పాల్గొనే వారిపై ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల వినియోగం కూడా నేరమేనని, వినియోగదారులపై సైతం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయి విక్రయాలు, అనుమానాస్పద వ్యక్తుల సంచారం, డ్రగ్స్ వినియోగం కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు. పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలు, ప్రజా ప్రదేశాలు, సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాలు, ప్రత్యేక తనిఖీలు, ఇంటర్‌సెప్టర్ వాహనాల ద్వారా అనుమానాస్పద కదలికలను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే పలు కేసులు నమోదు చేసి గంజాయి సరఫరాదారులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా డ్రగ్స్ విక్రయాలు లేదా ప్రలోభాలకు గురిచేసే వ్యక్తులపై సైబర్ విభాగం ప్రత్యేక నిఘా ఉంచిందని తెలిపారు. అపరిచితుల ఆఫర్లకు మోసపోవద్దని యువతను హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అనుమానాస్పద మార్పులు కనిపిస్తే వెంటనే కౌన్సిలింగ్ చేయించాలని సూచించారు. విద్యాసంస్థలు కూడా విద్యార్థులకు మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై తరచూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రజల సహకారం అత్యంత కీలకమని పేర్కొంటూ “జీవితానికి అవును… మాదక ద్రవ్యాలకు కాదు” అనే సందేశాన్ని సమాజంలో విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల నుంచి పట్టణాల వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్యపరుస్తామని తెలిపారు. ఎక్కడైనా గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే డయల్ 112, జిల్లా పోలీసుల వాట్సాప్ నంబర్ 9440900005, 1972 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు. మహిళలు, విద్యార్థులు, ప్రజల భద్రత కోసం అందుబాటులో ఉన్న ధైర్యస్పర్శ, శక్తి యాప్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.