
చిత్తూరు,చిత్తూరు ఎక్స్‌ప్రెస్,జూన్ 07:
మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని పూర్తిగా అరికట్టడంతో పాటు అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ లక్ష్యంగా చిత్తూరు జిల్లా పోలీసు శాఖ ఆదివారం భారీ స్థాయిలో ప్రత్యేక కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు నాన్ కేడర్ ఎస్పీ ఆపరేషన్స్ ఎస్.ఆర్. రాజశేఖర్ రాజు పర్యవేక్షణలో ఈ తనిఖీలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 20 ప్రాంతాల్లో రౌడీ షీటర్లు, గతంలో గంజాయి కేసుల్లో పట్టుబడిన నిందితులు, అనుమానిత వ్యక్తుల నివాసాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అత్యాధునిక డ్రగ్ డిటెక్షన్ కిట్ల ద్వారా 70 మందికి గుర్తింపు పరీక్షలు నిర్వహించగా, చిత్తూరు తాలూకా, యాదమరి పోలీస్ స్టేషన్ పరిధులకు చెందిన ఐదుగురు మాదకద్రవ్యాలు వినియోగించినట్లు గుర్తించారు. పాజిటివ్‌గా గుర్తించిన వ్యక్తులకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించి మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. అనంతరం “డ్రగ్స్ వద్దు – జీవితం ముద్దు” నినాదంతో ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించి డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని సూచించారు. ఇక కార్వేటినగరం మండలం కొత్తవీడు గోపిసెట్టిపల్లిలో ఎస్ఐ తేజస్విని ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో సారా తయారీకి ఉపయోగించే 450 లీటర్ల బెల్లం ఊటను గుర్తించి ధ్వంసం చేశారు. అలాగే చిత్తూరు ఒకటో పట్టణం, రెండో పట్టణం పోలీస్ స్టేషన్ పరిధిలోని 20 మంది రౌడీ షీటర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని, చట్టాలను గౌరవిస్తూ బాధ్యతాయుత పౌరులుగా జీవించాలని సూచించారు. భవిష్యత్తులో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎస్పీ తుషార్ డూడి మాట్లాడుతూ జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించడమే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. శాస్త్రీయ పద్ధతుల్లో డ్రగ్ డిటెక్షన్ కిట్ల ద్వారా వినియోగదారులను గుర్తించి, చట్టపరమైన చర్యలతో పాటు కౌన్సెలింగ్ కూడా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.ప్రజలు తమ పరిసరాల్లో గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాల విక్రయాలు, వినియోగం, నిల్వలు లేదా రవాణా జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. డ్రగ్స్ రహిత చిత్తూరు జిల్లా నిర్మాణానికి ప్రజల సహకారం అవసరమని పోలీసు అధికారులు పిలుపునిచ్చారు.