తొట్టంబేడు మండలం, చిత్తూరు ఎక్స్ప్రెస్, ఆగస్టు 17
తొట్టంబేడు మండలం ఇచ్చిన మాటకు కట్టుబడి దివ్యాంగురాలు తులసికి మెరుగైన వైద్యం అందించి, ఆమె తిరిగి నడిచేలా చేయడమే తన సంకల్పమని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు.
గత నెల జూలై 31న తొట్టంబేడు మండలం మామిడిగుంట హరిజనవాడలో పర్యటించిన సందర్భంగా దివ్యాంగురాలు తులసి దీనస్థితిని చూసి చలించిపోయానని ఎమ్మెల్యే తెలిపారు. మంచి వైద్యం అందిస్తే ఆమె తిరిగి నడిచే అవకాశం ఉందని తెలుసుకుని, చెన్నై అపోలో వైద్యులతో మాట్లాడి చికిత్స చేయిస్తానని అప్పుడే హామీ ఇచ్చానన్నారు. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకునే క్రమంలో చెన్నై అపోలో నిపుణుల బృందాన్ని శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి రప్పించినట్లు చెప్పారు. మండల పార్టీ అధ్యక్షుడు మునిరాజా నాయుడు సహకారంతో తులసిని ఆమె ఇంటి నుంచి వాహనంలో ఆసుపత్రికి తీసుకువచ్చి, వైద్యులతో అవసరమైన అన్ని పరీక్షలు చేయించినట్లు తెలిపారు. పరీక్షల నివేదికలు వచ్చిన అనంతరం మరింత మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటామని వైద్యులు తెలిపారని పేర్కొన్నారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లో ఉన్నప్పటికీ తులసి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా ఆరా తీస్తున్నానని ఎమ్మెల్యే చెప్పారు. అసెంబ్లీ విరామ సమయంలో వీడియో కాల్ ద్వారా తులసితో స్వయంగా మాట్లాడానని తెలిపారు. చికిత్సలో ఎలాంటి లోపం లేకుండా చూడాలని వైద్యులను, స్థానిక నాయకులను ఆదేశించినట్లు వెల్లడించారు. తులసి వైద్యానికి ఎంత ఖర్చైనా వెనకాడబోనని బొజ్జల సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. అవసరమైతే సొంత ఖర్చుతోనైనా, సీఎం సహాయ నిధి ద్వారా అయినా పూర్తి వైద్యం అందిస్తానని హామీ ఇచ్చారు.ఒక నాయకుడిగా కాకుండా మీ ఇంటి సొంత మనిషిగా తులసికి అండగా ఉంటాను. ఇచ్చిన మాటకు కట్టుబడి ఆమె మళ్లీ తన కాళ్లపై తాను నడిచేలా చేయడమే నా సంకల్పం అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు మునిరాజు నాయుడు, ఖాదర్ భాష,తెలుగుదేశం పార్టీ నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
