chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 5:51 am Digital Edition : CHITTOORE EXPRESS

మహిళా సాధికారతకు ఎన్డీఏ ప్రభుత్వం పెద్దపీట ఎంఎస్‌ఎంఈల ద్వారా మహిళలు, ఎస్సీ/ఎస్టీల అభ్యున్నతికి ప్రాధాన్యం లోక్‌సభలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం

చిత్తూరు/న్యూఢిల్లీ, చిత్తూరు ఎక్స్‌ప్రెస్,జూలై 31:

 

మహిళా సాధికారతకు ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) అభివృద్ధి ద్వారా మహిళలు, ఎస్సీ/ఎస్టీ పారిశ్రామికవేత్తలకు విస్తృత అవకాశాలు కల్పిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. లోక్‌సభలో చిత్తూరు పార్లమెంట్ సభ్యుడు దగ్గుమళ్ల ప్రసాదరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మంత్రి సమాధానాన్ని వివరిస్తూ ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు మాట్లాడుతూ, పబ్లిక్ ప్రొక్యూర్‌ మెంట్ పాలసీ–2012 ప్రకారం కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సీపీఎస్‌ఈలు) తమ మొత్తం కొనుగోళ్లలో కనీసం 25శాతం ఎంఎస్‌ఎంఈల నుంచే చేయాలని నిబంధన ఉందన్నారు. ఇందులో ఎస్సీ/ఎస్టీల యాజమాన్యంలోని సంస్థల నుంచి 4శాతం, మహిళల యాజమాన్యంలోని సంస్థల నుంచి 3 శాతం కొనుగోళ్లు జరపాలని ప్రభుత్వం నిర్దేశించిందని తెలిపారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఎంఎస్‌ఎంఈల నుంచి కొనుగోళ్లు ప్రతి ఏడాది పెరుగుతున్నాయని వివరించారు. 2021–22లో మొత్తం కొనుగోళ్లలో ఎంఎస్‌ఎంఈల వాటా 32.52 శాతం ఉండగా, 2022–23లో 37.10 శాతం, 2023–24లో 43.73 శాతం, 2024–25లో 42.85 శాతం, 2025–26లో 49.04 శాతానికి చేరిందన్నారు. అలాగే మహిళల యాజమాన్యంలోని ఎంఎస్‌ఎంఈల నుంచి కొనుగోళ్లు కూడా క్రమంగా పెరుగుతున్నాయని తెలిపారు. 2021–22లో 1.04 శాతం ఉన్న మహిళా ఎంఎస్‌ఎంఈల కొనుగోళ్లు 2022–23లో 1.33 శాతం, 2023–24లో 1.86 శాతం, 2024–25లో 2.96 శాతం, 2025–26లో 3.84 శాతానికి పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించిందన్నారు. ఎస్సీ/ఎస్టీ యాజమాన్యంలోని ఎంఎస్‌ఎంఈల నుంచి కొనుగోళ్లు కూడా క్రమంగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. సీపీఎస్‌ఈలు పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ నిబంధనలను సమర్థంగా అమలు చేస్తున్నాయా లేదా అనే అంశాన్ని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖతో కలిసి నిరంతరం సమీక్షిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తన సమాధానంలో తెలిపిందని ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు వెల్లడించారు. ఈ చర్యలతో మహిళలు, ఎస్సీ/ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ కొనుగోళ్లలో మరిన్ని అవకాశాలు లభించి, వారి ఆర్థిక సాధికారతకు బలమైన ప్రోత్సాహం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.