chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 08 May 2026, 7:24 am Digital Edition : CHITTOORE EXPRESS

మహిళల భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించిన  శ్రీసిటీ డి.ఎస్.పి బివి శ్రీనివాసులు   బ్లూ స్టార్ సంస్థ మహిళా ఉద్యోగులకు సూచనలు

శ్రీసిటీ,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మే07:

 

మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ,మహిళా హక్కుల పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు శ్రీ సిటీ పోలీసులు బ్లూ స్టార్ పరిశ్రమలో ప్రత్యేక సదస్సు నిర్వహించారు. మహిళల భద్రత మా బాధ్యత అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శ్రీ సిటీ ఉప పోలీసు అధికారి బీవీ శ్రీనివాసులు మాట్లాడుతూ.. మహిళలు ధైర్యంగా ముందుకు రావాలని, తమపై ఎలాంటి అన్యాయం జరిగినా వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. అత్యవసర సహాయ సంఖ్యలు100,112 వినియోగంపై అవగాహన కల్పించారు. శక్తి భద్రత దరఖాస్తు వినియోగం, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, బాల్య వివాహాల నిరోధం, బాలల రక్షణ చట్టం ప్రాముఖ్యత,రోడ్డు భద్రత అంశాలపై వివరించారు. పని చేసే ప్రదేశాల్లో ఎవరైనా అసౌకర్యానికి గురిచేస్తే సంస్థ యాజమాన్యానికి లేదా పోలీసులకు తెలియజేయాలని సూచించారు. మహిళా సాధికారత దేశ అభివృద్ధికి ఎంతో అవసరమని, మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఆకాంక్షించారు. ఉప నిరీక్షకురాలు ఎం. ప్రియాంక మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న నేరాలు, వాటికి సంబంధించిన శిక్షలపై అవగాహన కల్పించారు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంచుకోవాలని, తెలియని వ్యక్తుల నుంచి వచ్చే సందేశాలు, కాల్స్‌కు స్పందించరాదని హెచ్చరించారు. మానసిక ధైర్యం పెంపొందించుకోవాలని, వేధింపులు ఎదురైతే మౌనం పాటించకుండా స్వరం వినిపించాలని సూచించారు. అలాగే సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల ప్రమాదాలు, గంజాయి వినియోగ దుష్పరిణామాలు, రోడ్డు భద్రత నియమాలపై కూడా ఉద్యోగులకు అవగాహన కల్పించారు. సైబర్ సహాయ సంఖ్య 1930, మహిళల సహాయ సంఖ్య 181 వినియోగం పై వివరించారు. ఈ కార్యక్రమంలో బ్లూ స్టార్ పరిశ్రమ యాజమాన్యం, మహిళా ఉద్యోగులు,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.