
కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మే29:
తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడులో ముస్లిం మహిళా ప్రతినిధ్యానికి విశేష ప్రాధాన్యం లభించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గనిర్దేశంలో, ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్, ఏపీఎస్‌ఆర్టీసీ ఉపాధ్యక్షుడు పీఎస్ మునిరత్నం, పీఎంకే ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్‌బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన మహానాడులో కుప్పం పట్టణం 11వ క్లస్టర్‌కు చెందిన ముస్లిం మహిళా నాయకురాలు ప్రతీక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ మహిళల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ప్రతీకకు మహానాడులో ప్రత్యేక గుర్తింపు లభించింది. సామాన్య కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఆమె అనేక ప్రతికూల పరిస్థితులను అధిగమించి ప్రజాసేవా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించు కున్నారు. మహిళల సాధికారత, సామాజిక చైతన్యం, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ స్థానికంగా మంచి పేరు పొందారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండే ప్రతీక ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని స్థానికులు పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలు, యువత ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతీక మాట్లాడుతూ మహిళలు రాజకీయ రంగంలో మరింత ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని, వారికి తగిన అవకాశాలు కల్పించినప్పుడే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. మహిళల సంక్షేమం, యువత అభ్యున్నతి, సామాజిక న్యాయం కోసం నిరంతరం పనిచేస్తానని తెలిపారు. 11వ క్లస్టర్ ఇంచార్జి కన్నన్ మాట్లాడుతూ ప్రతీక పార్టీ అభివృద్ధికి, ప్రజాసేవకు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. భవిష్యత్తులో మరింత మంది మహిళలు ప్రజాసేవలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా నాయకులు, పార్టీ కార్యకర్తలు, యువజన నాయకులు, కాలనీవాసులు పాల్గొని ప్రతీకకు అభినందనలు తెలియజేశారు. మహానాడులో ఆమెకు లభించిన గుర్తింపు కుప్పం ప్రాంత ముస్లిం మహిళల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందని పలువురు అభిప్రాయపడ్డారు. మహిళా సాధికారతకు ప్రతీక ఒక ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు.