chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 22 June 2026, 8:42 am Digital Edition : CHITTOORE EXPRESS

భగవద్గీత సందేశాలతో త్రైత సిద్ధాంత ప్రచారం

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూన్ 22:

 

కుప్పం మున్సిపాలిటీపరిధిలోని ఆనిమిగానాపల్లి గ్రామంలో త్రైత సిద్ధాంతం–ప్రబోధ సేవాసమితి ఇందూ జ్ఞాన వేదిక కుప్పం, శివరాంపురం కమిటీల ఆధ్వర్యంలో త్రైత సిద్ధాంత భగవద్గీత ప్రచారకార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భం గా సభ్యులు త్రైతారాధన విశిష్టతను ప్రజలకు వివరించారు. భగవద్గీతలోని పురుషోత్తమ ప్రాప్తి యోగం అధ్యాయంలోని 16,17 శ్లోకాలలో ప్రస్తావించిన క్షర పురుషుడు, అక్షర పురుషుడు, పురుషోత్తముడు అనే జీవాత్మ, ఆత్మ, పరమాత్మల తత్వాలను సులభంగా అర్థమయ్యేలా వివరించారు. అలాగే బ్రహ్మయోగం, కర్మయోగం, భక్తియోగం అనే మూడు ధర్మాల సమన్వయమే త్రైతారాధన అని తెలిపారు. ఈ ఆధ్యాత్మిక మార్గం ద్వారా ముక్తి యొక్క అసలు భావాన్ని తెలుసుకోవచ్చని, ఆధ్యాత్మిక చింతనతో కూడిన జీవన విధానాన్ని ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలని సూచించారు. భగవద్గీతలోని విలువైన సందేశాలను సమాజంలోని ప్రతి వర్గానికి చేరవేయడం ద్వారా ధార్మిక చైతన్యం పెంపొందుతుందని, యువత కూడా ఆధ్యాత్మికత వైపు మళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో త్రైత సిద్ధాంతం–ప్రబోధ సేవాసమితి ఇందూ జ్ఞాన వేదిక కుప్పం, శివరాంపురం కమిటీల అధ్యక్షులు, సభ్యులు కృష్ణ, కృష్ణమూర్తి, శరవణ, రంగప్ప, శశాంక్, దివాకర్, చందు, లోకేష్, కళ్యాణి, ఇందిరా, చిన్నక్క, సుకన్య, విమల, బిందు, పూజ తదితరులు పాల్గొన్నారు.