chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 25 May 2026, 8:35 am Digital Edition : CHITTOORE EXPRESS

బైక్‌ల దొంగ అరెస్ట్..  ఐదు మోటార్ సైకిళ్లు స్వాధీనం

సూళ్లూరుపేట,చిత్తూరు ఎక్స్ ప్రెస్, మే 24:

 

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట, తడ, తిరుపతి టౌన్ ప్రాంతాల్లో వరుసగా మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్‌జిల్లా పాత నేరస్థుడిని సూళ్లూరుపేట పోలీసులు అరెస్ట్ చేసి, అతడి వద్ద నుంచి సుమారు రూ.5 లక్షల విలువైన ఐదు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బారాయుడు ఆదేశాల మేరకు, నాయుడుపేట డీఎస్పీ బి. చెంచుబాబు పర్యవేక్షణలో, సూళ్లూరుపేట సీఐ ఎం. మురళీకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా సూళ్లూరుపేట ఎస్సై అజయ్ కుమార్, పోలీస్ సిబ్బందితో కలిసి పట్టణ పరిసర ప్రాంతాల్లో వాహన తనిఖీలు నిర్వహించారు. శనివారం ఉదయం 11.30 గంటల సమయంలో అందిన రహస్య సమాచారం మేరకు మన్నారుపోలూరు గ్రామంలోని మామిడి రేవుల ప్రాంతానికి వెళ్లిన పోలీసులు, అక్కడ మోటార్ సైకిల్‌పై అనుమానాస్పదంగా నిలబడి ఉన్న యువకుడిని గుర్తించారు. పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా సిబ్బంది వెంటాడి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు నెల్లూరు సిటీ కళ్లారుపల్లి కాలనీ (డీడీ కాలనీ)కి చెందిన తంజావూరు గణేష్ కుమార్ (19), సుబ్బురాయన్ కుమారుడిగా గుర్తించారు. కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్న అతడు గతంలో నెల్లూరు టౌన్‌లో దొంగతనం కేసులో జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన తర్వాత కూడా తన ప్రవర్తన మార్చుకోకుండా మళ్లీ బైక్ దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో అంగీకరించినట్లు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీకి గురైన ఒక కేటీఎం బైక్, ఒక పల్సర్-220 బైక్, తడ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగిలించిన మరో పల్సర్-220 బైక్‌తో పాటు తిరుపతి టౌన్ ప్రాంతంలో చోరీకి గురైన నెంబర్ ప్లేట్లు లేని ఒక పల్సర్-220, ఒక హోండా యాక్టివా స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఐదు వాహనాల మొత్తం విలువ సుమారు రూ.5 లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. కేసుల్లో నిందితుడిని పట్టుకోవడంతో పాటు వాహనాల రికవరీలో ప్రతిభ కనబరిచిన ఎస్సై అజయ్ కుమార్, పోలీస్ కానిస్టేబుల్ కె.కుప్పారావు, హోంగార్డ్ వి.కిరణ్‌బాబులను సీఐ ఎం.మురళీకృష్ణ అభినందించారు. వీరికి రివార్డులు అందించాలని ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.