chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 09 May 2026, 7:31 am Digital Edition : CHITTOORE EXPRESS

బాలికల సాధికారిత మనందరి బాధ్యత ఈశ్వరయ్య గిరిజన కాలనీలో అనీమియా,కిశోరి వికాసంపై అవగాహన సదస్సు

శ్రీకాళహస్తి, చిత్తూరు ఎక్సప్రెస్, మే 08 :

 

శ్రీకాళహస్తి రూరల్ మండలంలోని ఈశ్వరయ్య గిరిజన కాలనీలో కిషోర్ బాలికలకు బాలికల సాధికారిత, అనీమియా (రక్తహీనత) నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సూపర్వైజర్ మల్లీశ్వరి మాట్లాడుతూ కౌమార దశలో ఉన్న బాలికలు రక్తహీనత బారిన పడకుండా పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, గుడ్లు, రాగిజావతో పాటు ఐరన్ అధికంగా ఉండే గోంగూర, మునగాకు వంటి ఆహార పదార్థాలను తీసుకొని ఆరోగ్యం కాపాడుకోవాలని తెలిపారు. అలాగే కౌమార దశలో ఎదురయ్యే పలు ఆరోగ్య సమస్యలపై బాలికలకు అవగాహన కల్పించారు.స్త్రీ శిశు సంక్షేమ శాఖ సూపర్వైజర్లు ప్రియాంక, హరిత మాట్లాడుతూ మే 1 నుంచి జూన్ 12 వరకు నిర్వహిస్తున్న కిశోరి వికాసం కార్యక్రమంలో భాగంగా యుక్తవయసులో వచ్చే శారీరక, మానసిక మార్పులను సమర్థంగా ఎదుర్కొని విద్యలో రాణించాలని సూచించారు.ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా భవిష్యత్తుపై దృష్టి పెట్టి ముందుకు సాగాలని బాలికలకు సూచించారు.ప్రగతి స్వచ్ఛంద సంస్థ శ్రీకాళహస్తి మండల కోఆర్డినేటర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో కిషోర్ బాలికలకు 18 సంవత్సరాలు పూర్తయ్యే వరకు తల్లిదండ్రులు వివాహ ప్రయత్నాలు చేయవద్దని, వారిని విద్యలో ప్రోత్సహించాలని కోరారు.అనంతరం బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేద్దామని నినాదాలు చేస్తూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం చైతన్య,ఆశ వర్కర్ రేవతి, అంగన్వాడీ టీచర్లు సౌజన్య, మంజుల, వాణి, కిషోర్ బాలికలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే గ్రామ మహిళలు, గ్రామ పెద్దలు, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.