chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 22 June 2026, 9:19 am Digital Edition : CHITTOORE EXPRESS

బహిరంగ మద్యం సేవపై ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం ప్రత్యేక తనిఖీల్లో 10 కేసులు నమోదు.. 52 మద్యం సీసాలు స్వాధీనం

కుప్పం,చిత్తూరు ఎక్స్‌ప్రెస్,జూన్ 21:

 

కుప్పం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై ఎక్సైజ్ శాఖ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి కేసులు నమోదు చేసింది. గత వారం రోజులుగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చేపట్టిన తనిఖీల్లో పలువురిని అదుపులోకి తీసుకుని మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ ఏ.నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం పూర్తిగా నిషేధమని, ప్రజా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఏమాత్రం సహించబోమని హెచ్చరించారు. ప్రత్యేక తనిఖీల్లో బహిరంగంగా మద్యం సేవిస్తూ పట్టుబడిన నలుగురిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అదే సమయంలో సర్కిల్ పరిధిలో నిర్వహించిన విస్తృత తనిఖీల్లో మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న 52 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై మొత్తం 10 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రజలు చట్టాలను గౌరవించి బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ప్రజా ప్రదేశాల్లో మద్యం సేవించడం వల్ల సామాజిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, ఇటువంటి చర్యలపై ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. ఇలాంటి ప్రత్యేక డ్రైవ్‌లు నిరంతరం కొనసాగుతాయని, చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టేందుకు ఎక్సైజ్ శాఖ మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుందని తెలిపారు. ప్రజల సహకారంతో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గమనిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని ఎక్సైజ్ శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.